– అభ్యర్థుల ప్రకటన వేళ బీజేపీలో గందరగోళం
– మల్కాజిగిరి హాట్‌టాపిక్..ఈటల టార్గెట్
– ఆదిలాబాద్ సీటుపై మూడుముక్కలాట
– నాగర్‌కర్నూల్‌లో పాతనేతల అసంతృప్తి
– జహీరాబాద్ నియోజకవర్గ బరిలో బీఆర్‌ఎస్ తాజా ఎంపీ
– ఒకరికిస్తే మరొకరు సహకరించలేని పరిస్థితి
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన సందర్భంగా చెలరేగిన మాదిరిగానే పార్లమెంట్ అభ్యర్థుల విషయంలోనూ బీజేపీలో నిరసనల పర్వం మొదలైంది. ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే మరొక నేత సహకరించని పరిస్థితిలో జాతీయ నాయకత్వం అభ్యర్థిత్వాలపై ఎటూ తేల్చలేకపోతున్నది. తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఇప్పుడు అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఆదిలాబాద్ సీటు నాకంటే నాకంటూ నలుగురు నేతలు పట్టుబడు తున్నారు. జహీరాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ నుంచి చేరిన నేతలే అభ్యర్థులుగా ఉంటారనే చర్చ నడుస్తుండగా మొదటి నుంచీ పార్టీనే నమ్ముకుని పోటీ కోసం సన్నద్ధం అవుతున్న నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మల్కాజ్ గిరి నియోజకవర్గం బీజేపీలో హాట్ సీట్ గా మారింది. ఆశావాహ నేతలు సీటు తమకంటే తమకే దక్కుతుందంటూ అని ప్రచారం చేసుకుంటున్నారు. హేమాహేమీలు ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సైలెంట్‌గా ప్రచారం, వాల్‌రైటింగ్ లాంటి పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తనకే సీటు ఖరారైందని శామీర్ పేటలోని తన నివాసంలో పలువురు నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టడంతో ఆయనపై స్థానిక నేతలు తిరుగుబావుట ఎగురవేశారు. సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీహోంమంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీశ్‌రెడ్డి, ప్రముఖ్య విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, చాడ సురేశ్‌రెడ్డి, తదితర నేతలంతా ఈటలకు సీటు ఇవ్వొద్దనే చర్చను తెరపైకి తీసుకొచ్చారు. రెండు అసెంబ్లీ టికెట్లు ఇచ్చినా ఆయన గెలువలేకపోయాడనీ, మళ్లీ పార్లమెంట్ టికెట్ ఆయనకే ఇస్తే తమ పరిస్థితి ఏంటని పార్టీ నాయకత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. అంతిమంగా మల్కాజిగిరిలో ఎవ్వరికి సీటిచ్చినా మరొకరు మనస్ఫూర్తిగా సహకరించలేని ధైన్యపరిస్థితి నెలకొంది. ఈటలవైపే జాతీయ నాయకత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కొందరు కీలక నేతలు ఈటలకు సీటు దక్కకుండా చక్రం తిప్పుతున్నారనే చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ అధిష్టానం ఈ సీటును తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈటలను మెదక్‌కు పంపితే ఎలా ఉంటుందనే విషయంపైనా జాతీయ నాయకత్వం చర్చిస్తున్నట్టు తెలిసింది. తనకు సీటురాదనే స్పష్టతకొచ్చిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తున్నది.
ఆదిలాబాద్‌లో మూడుముక్కలాట
ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిత్వ ఎంపిక మూడుముక్కలాటలా తయారైంది. కాంగ్రెస్ పార్టీని కాదనుకుని బీజేపీలో చేరి ఆ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తుడుందెబ్బ నేత, ఎంపీ సోయం బాపూరావుకు ఈసారి సొంతింటి పోరు ఎక్కువైంది. ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో బలమైన లాబీయింగ్ కొనసాగుతున్నది. మాజీ ఎంపీలు రమేశ్‌రాథోడ్, నగేశ్ కూడా తమకంటే తమకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రమేశ్‌రాథోడ్‌కు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్ మద్దతు పుష్కలంగా ఉన్నట్టు తెలిసింది. ఇదే సీటు కోసం డాక్టర్ సుమలత, బైంసా మార్కెట్ కమిటీ చైర్మెన్ జాదవ్ రమేశ్ కూడా పోటీపడుతున్నారు. ఆ ముగ్గురు నేతల్లో ఒకరికి సీటిస్తే మరో ఇద్దరు సహకరించని పరిస్థితి ఉంది.
కరీంనగర్‌లోనూ కిరికిరి..జహీరాబాద్, నాగర్‌కర్నూల్‌లో అసంతృప్తి
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తాజా ఎంపీ బండి సంజరుకుమార్ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. కానీ, ఆయన అభ్యర్థిత్వాన్ని కరీంనగర్ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారిలో కొందరు వైరిపక్షంలో చేరారు. కిషన్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, మరో నేత సుగుణాకర్‌రావు బండి అభ్యర్థిత్వాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈటల గ్రూపు కూడా సంజరుకి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్, మాజీ ఎంపీ బాణారెడ్డి కుమారుడు జైపాల్‌రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు నేతలు ఆ సీటును ఆశించి స్థానికంగా పనిచేసుకుంటున్నారు. తాజాగా, బీఆర్‌ఎస్ ఎంపీ బీబీపాటిల్ టికెట్ హామీతో బీజేపీలో చేరిపోయారు. దీంతో ఆ సీటును ఆశిస్తున్న నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. నాగర్‌కర్నూల్ ఎంపీ సీటును తాజీ ఎంపీ రాములు లేదా అతని కుమారుడికి ఇస్తారనే ప్రచారంతో ఇన్నేండ్లు పార్టీ కోసం పనిచేస్తున్న బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి కూడా అసంతృప్తుల జాబితాలో చేరిపోయారు. హైదరాబాద్ సీటులో అభ్యర్థిత్వంపైనా సందిగ్ధత నెలకొంది. ఆ నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న వారిలో విరించి ఆస్పత్రుల చైర్మెన్ మాధవీలత, డాక్టర్ భగవంతరావు ఉన్నారు. ఇక్కడ నుంచి రాజాసింగ్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే, ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తనకే పోటీచేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది.