
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ – భువనగిరి రూరల్
10 వారాలుగా ఎండలో మాడిపోతు పని చేస్తున్న కూలీలకు కుటుంబ పోషణ కోసం డబ్బులు చెల్లించాలని, ఉపాధి హామిలో రోజు కూలీ ఎంత వస్తుందో కార్మికుల ఆవేదన చెందుతున్నారని , సంవత్సరం నుండి కార్మికులకు పే స్లిప్ లు, పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మండలం ఉన్న ఏపిఓ,టిఎలు ఏమిచేస్తున్నారని ఇప్పటికైనా పే స్లిప్ లు వారం వారం ఇచ్చి , పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని ముస్త్యాలపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా పేదలు వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి పార్లమెంటులో వామపక్ష పార్టీల ఎంపీల ఆందోళన ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఉపాధి హామీ పనికి నిధులు కోత విధిస్తూ కొత్త కొత్త జీవోలను విడుదల చేస్తూ చట్టాన్నె నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 2005లో చట్టము వచ్చినప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేసే కార్మికులకు వారు చేస్తున్న పనికి రోజువారి కూలి ఎంత వస్తుందో తెలియజేయడానికి పే స్లిప్ లు ఇవ్వాలని ఉన్న ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించారు. వారం వారం చేసిన పని డబ్బులు చెల్లించాలని ఉన్నా మూడు, నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో పని చేస్తున్న కార్మికుల కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని ప్రశ్నించారు. చట్ట ప్రారంభదశలో కూలీల పని ప్రదేశంలో దగ్గర తాగడానికి మంచినీళ్లు, నీడ కోసం టెంటు, పని ప్రదేశంలో గాయపడితే మెడికల్ కిట్టు, చంటి పిల్లలను ఎత్తుకోవడానికి కూడా పని మనుషులు ఉండేవారు కానీ రాను రాను వీటన్నింటినీ తగ్గించి కూలీలను ఉపాధి పనికి రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. 18 సంవత్సరాల క్రితం పనిచేసే కూలీలకు పనిముట్లు ఇవ్వగా ఆ తర్వాత నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరికి కూడా నూతన పనిముట్లు ఇవ్వలేదని కూలీలే సొంత డబ్బులతో నూతన పనిముట్లు కొనుక్కొని పనికి పోతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. ఆ పనిముట్లు పనికి యోగ్యంగా తయారు చేసుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువులు పెద్దఎత్తున పెరుగుతుంటే ఉపాధి హామీ పథకంలో 272 రూపాయలు ఇవ్వాలని ఉన్న కేవలం 100 నుండి 150 రూపాయలు దాటడం లేదని దీంతో కూలీల కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టంలో ఉన్న ప్రకారం పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని, సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజుకూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని, పని ప్రదేశంలో గాయపడిన వారికి వైద్యం ఖర్చు తో పాటు పనిచేయని రోజులలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పనిచేస్తున్న కార్మికులకు వారం రోజులల్లో పెండింగ్ బిల్లులు, పే స్లిప్ లు ఇవ్వకపోతే కార్మికులతో మండల పరిషత్ కార్యాలయం ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని నర్సింహ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు కళ్లెం లక్ష్మినర్సయ్య, ఉపాధి హామీ కార్మికులు పసునాది లావణ్య, గంటపాక గౌతమి, పసునాది మనమ్మ , గాదె మానస, గెంటపాక రాములమ్మ, రాగుల మల్లేష్, కానుగు పరమేష్ , పసనాది లక్ష్మి, గణేష్, వట్టి ఐల్లయ్య, సునీత లు పాల్గొన్నారు.