అది దేశం అయితే దేశం, పట్నం అయితే పట్నం, పల్లె అయితే పల్లె, ఏదయితేనేం అన్నిచోట్లా కొందరు మనుషులు తిరుగాడ్తుంటారు. వీళ్లు మామూలు వాళ్లుకాదు. వీళ్లదో ప్రత్యేకమైన జాతి. అందరికీ ఏదో ఓ మతం కులం ఉన్నా వీరి గుర్తింపే వేరు. వీరంతా ప్రత్యేకమైన బస్సుల్లో ఎక్కి దిగుతుంటారు. ప్రత్యేకం ఎందుకనగా ఆ బస్సులు నాలుగు చక్రాల మీద తిరిగినా రంగులు మాత్రం వేరు వేరు. గాలిలో ఎగరలేనివీ, నీటిలో ఈదలేనివీ అయిన బస్సులు రోడ్డుమీదే కదా పరుగుపెట్టాలి. అలాగ పరుగెడుతూ వచ్చిందో బస్సు. అదో రంగు బస్సు. ఆగిన బస్సునే కదా ఎవరైనా ఎక్కేది. బస్సు ఆగింది. ‘గయారాం’ బస్సెక్కబోతుంటే కిందికి దిగాడు ‘ఆయారాం’. నాలుగు కళ్లూ కల్సుకున్నాయి కానీ పెదాలు విచ్చుకోలేదు. ముఖాల మీద నవ్వుకు చిరునామా లేదు.
జరిగిందింతే! గయారాం ఓ రంగు బస్సెక్కాడు. ఆయారాం ఆ రంగు బస్సులోనుంచి కిందికి దిగాడు. దిగేవాడు దిగాక, ఎక్కేవాడు ఎక్కాక బస్సు కదలకుండా ఉండిపోదుగా. బస్సు కదిలింది. వేగం పెంచింది. కాసేపటికి బస్సు వేగం తగ్గింది. వేగం తగ్గిన బస్సు ఆగింది. బస్సు ఆగితే ఏమవుతుంది. దిగేవాళ్లు దిగుతారు. ఎక్కేవాళ్లు ఎక్కుతారు. ఆగిన బస్సులోనుంచి గయారాం కిందికి దిగాడు. ఆయారాం బస్సెక్కాడు.
జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు బస్సు దిగాడు ఆయారాం. బస్సు ఎక్కాడు గయారాం. ఇప్పుడు బస్సు దిగాడు గయారాం. బస్సు ఎక్కాడు ఆయారాం. అసలు ఈ ఆయారాం గయారాంలు ఎవరు? ఒకడు దిగడం, మరొకడు బస్సు ఎక్కడం ఇది జరిగేటప్పుడు వాళ్ల ముఖాల్లోకి చూస్తే మనకేమీ అర్ధం కాదు కానీ, నిజానికి ఈళ్లిద్దరూ ప్రత్యేకమైన జాతికి చెందినవారే.
ఆయారాం గయారాంలు బద్ధ శత్రువులేమీ కారు. అలాగని జిగ్రీ దోస్తులు కారు. అప్పుడప్పుడు దోస్తులై, కానప్పుడు శత్రువులైపోతారు. అంటే పర్మనెంటుగా దోస్తులు కారు, శత్రువులూ కారు. అసలు ఈ ప్రత్యేకమైన జాతి వారంతా ఇంతే. బస్సుల రంగులు మారుతయి, కండువాల కలర్లు చేంజవుతయి అంతే! అవసరమైనప్పుడు కావలించుకుంటారు, కానప్పుడు వీపులు పదేపదే తడుముకుంటుంటారు. తెలీకుండా కత్తో, ఖడ్గమో, బల్లెమో, బాణమో గుచ్చుకుందేమోనని.
ఆయారాం గయారాంలు ఎప్పుడూ ఓకే రంగు బస్సు ఎక్కరు. అలాగే ఎప్పుడూ ఒకే రంగు కండువా కప్పుకోరు. ఒక బస్సు దిగి మరో రంగు బస్సులో ఎక్కేప్పుడు ఆయారామైతేనేం గయారామైతేనేం, కండువాల రంగు మారుతుంది. బస్సు రంగును బట్టి కండువా రంగుంటుంది.
ఆయారాం బస్సెక్కేప్పుడు గయారాం బస్సు దిగుతాడు. అంటే ఎప్పుడూ ఆయారాం ఎక్కిన బస్సులోనుంచి గయారాం దిగుతాడని, ఇద్దరూ ఒకే బస్సులో మాత్రం ఉండరని అనుకోవద్దు. ప్రత్యేకమైన జాతి వాళ్లు కదా! ఏదీ ‘ఫిక్స్‌డ్’గా ఉండదు. సమయం సందర్భం అనేవి వుంటయి కద, ఒక్కొక్కప్పుడు ఇద్దరూ ఒకేరంగు బస్సు ఎక్కేస్తారు. అప్పుడు ఆయారాం గయారాంల నాలుగు కళ్లు కల్సుకోవటమే కాదు, చూడముచ్చటైన ‘ఎక్స్‌ప్రెషన్’ కూడా కనిపిస్తుంది. పెదాలు పత్తివూవుల్లా విచ్చుకుంటయి. ముఖాల్లో మీసాలు కూడా పగలబడి నవ్వేస్తుంటయి. మాటలు కూడా కలుస్తయి.
‘ఆయారాం… నువ్వు బస్సు ఎక్కుడు, నేను బస్సు దిగడం, బస్సు రంగులు, కండువాల రంగులు మార్చుకోవడం ఇదేనా మన జీవితం’ అంటాడు గయారాం. ‘గయారాం… బస్సులు మార్చినా, కండువాలు మార్చినా మన బతుకే హాయి. సాఫ్ట్‌వేరయితే గొడ్డు చాకిరీ, ప్రభుత్వోద్యోగం రాసిపెట్టి వుండాలి, వ్యాపారాలు రిస్కు, లాంగ్ జంపూ, హై జంపూ తెల్సిన మనకు అవసరమా’ అంటాడు ఆయారాం.
‘అవును ఆయారాం… కలెక్టర్లూ, సెక్రెట్రీలు, ఐపీఎస్‌లూ చేతులు కట్టుకుని నిలబడే వృత్తీ, వ్యాపారం మరొకటీ ఇంకోటీ వుందా చెప్పు? విద్యార్హత అక్కర్లేదు, వయోపరిమితి లేనేలేదు. ఐదేళ్లకే పెన్షన్, టాక్సులు లేవు. వసతుల సంగతి అడగక్కర్లేదు’ అంటాడు గయారాం.
ఆయారాం గయారాంలు ఇద్దరూ ఎంచుకున్న వృత్తిలో కంటిన్యూ అవడానికి చేయవలసిందల్లా బస్సులు మార్చడం, కండువాలు మార్చడం అంతే! ఒక బస్సులో సీటు దొరక్కపోతే మరో బస్సు. ఒక కండువా కల్సిరాకపోతే మరో కండువా అంతే! పార్టీలు, సిద్ధాంతాలు, ప్రజలు వీళ్లకు అవసరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉద్యోగ భద్రతను చూసుకోడానికి ఏదైతే, ఏది పడితే అది చేయడం అంతే! రిటైర్‌మెంట్ లేకుండా కాపాడుకోవడం అంతే! ఓట్లు కొనడానికి దోచుకున్న సొమ్ములోనుంచి కొంత ఖర్చుపెట్టడం అంతే!
ఆయారాం గయారాంలది ఓ ప్రత్యేకజాతి. ఈ జాతి రోజురోజుకూ పెరిగి పెట్రేగుతున్నది. ప్రజాస్వామ్యం ప్రజల డబ్బుతో పెంచి పోషించుతున్న అనేకమంది ఆయారాం, గయారాంలకు ‘రాంరాం’ చెప్పగలిగినవాళ్లు లేరా? ఎందుకులేరు? వాళ్లనే కదా ఓటర్లు అంటారు.
– చింతపట్ల సుదర్శన్
9299809212