అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సరికాదు

– బయో మెట్రిక్‌ పేరుతో బ్లాక్‌ మెయిలింగ్‌
– రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలి
– తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.సునిత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన ఐసీడీఎస్‌ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంగన్‌వాడీలను అవమానించే విధంగా మాట్లాడారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ ఏర్పడి 48 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు 60 శాతం కేంద్రాలకు పక్కా భవనాలు, 90 శాతం కేంద్రాల్లో డబుల్‌ సిలిండర్‌ లేదని అన్నారు. కొన్ని కేంద్రాల్లో బాత్రూంలు, మంచినీటి సౌకర్యం, కాంపౌండ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా మెస్‌ చార్జీలు పెంచక పోవడం వల్ల పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూరగాయలు, పాలు భద్రపర్చుకోవడానికి ఫ్రిజ్‌లు లేవని వివరించారు. పురుగుల బియ్యం, ముక్కిపోయిన పప్పు, మురిగిపోయిన కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అంగన్‌వాడి కేంద్రాల్లో మౌళిక వసతులు, పిల్లలకు ఆహారాన్ని అందించే వ్యవస్థను మెరుగుపర్చాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికీ ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత లేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన రూ. 18వేల వేతనం, పీఎఫ్‌ సౌకర్యంపె స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో చేసిన 24 రోజుల సమ్మె కాలానికి ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని గుర్తు చేశారు. ఐసీడీఎస్‌ పర్యవేక్షణ కోసం సూపర్‌వైజర్లు, ఆరోగ్యలక్ష్మి తదితర యాప్స్‌ అనేకం ఉండగా కొత్తగా వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వేల పేరుతో బయట తిరిగే ఉద్యోగులకు బయోమెట్రిక్‌ పెట్టడాన్ని వారు తప్పు పట్టారు. సిబ్బందిపై నిఘా పెట్టడం మాని కేంద్రాలకు పోషకాహారాన్ని సరఫరా చేసే కాంట్రాక్టర్లపై నిఘా పెట్టాలని సూచించారు. ఐసీడీసీని ఐలోపేతం చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనీ, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు