– పోలీస్ కానిస్టేబుల్ సహా ఒక మావోయిస్టు మృతి
– వివరాలు వెల్లడించిన ఏఎస్పీ
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు చత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లా అంబుజమాడు దండకారణ్యం ఛోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధి హిందూర్ అడవుల్లో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య గంట పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో కాంకేర్ జిల్లా సంఘం పఖంజోర్ గ్రామ నివాసి బస్తర్ ఫైటర్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేష్ కురేతి సైతం మృతి చెందారు. సెర్చ్ ఆపరేషన్ ఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహంతో పాటు ఏకే 47 తుపాకీ, మావోయిస్టుల దైనందిక సామగ్రి, విప్లవ సాహిత్యం లభించిందని కాంకేర్ ఏఎస్పీ వివరించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు భారీగా అడవులను జల్లెడ పడుతున్నాయని వివరించారు.