ఉద్యో‌గుల స‌మ‌స్య‌లు ప‌రిష్కా‌ర‌మ‌య్యే‌నా?

– రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం
– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
– డీఏల కోసం ఉద్యోగుల నిరీక్షణ..
– పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌
– సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ
– మాట నిలబెట్టుకోవాలంటున్న ఉద్యోగ సంఘాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ నాలుగేండ్ల తర్వాత ఫిబ్రవరి వేతనాలను, పెన్షనర్లకు పింఛన్‌ను మార్చి ఒకటో తారీఖున చెల్లించడం పట్ల ఆనందం వ్యక్తమవుతున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకటో తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్న హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలోని 3,69,200 మంది ఉద్యోగులకు జీతాలు, 2,88,000 మంది పెన్షనర్లకు పింఛన్‌ చెల్లించింది. బీఆర్‌ఎస్‌ పాలనలో రెండోవారం, మూడో వారం జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జీతాల చెల్లింపులో మార్పు వచ్చింది. దీనిపై హర్షం వ్యక్తమవుతున్నది. అయితే ఉద్యోగులు ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. జనవరితో కలిపితే నాలుగు కరువు భత్యం (డీఏ)లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం ఏడాదికిపైగా నిరీక్షిస్తున్నారు. అదే విధంగా ట్రెజరీల్లో ఆమోదం పొంది రెండేండ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, పీఆర్సీ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పెన్షన్‌ తదితర బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను తక్షణమే చెల్లిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇంకోవైపు డీఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. సప్లిమెంటరీ బిల్లులను 15 రోజుల్లో చెల్లిస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా డీఏ, పెండింగ్‌ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
ఉద్యోగుల్లో ఆందోళన
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ ఈనెల 10 తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశమున్నది. ఇందుకు సంబంధించి ఈసీ కసరత్తు చేస్తున్నది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం డీఏ, పెండింగ్‌ బిల్లుల విడుదలపై నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనే దానిపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల కోడ్‌ వస్తే ఫలితాలు వచ్చేదాకా డీఏ, పెండింగ్‌ బిల్లుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఈలోపు డీఏలను ప్రకటించాలని ఉద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. 2022, జులైలో 3.64 శాతం, గతేడాది జనవరిలో 3.64 శాతం, జులైలో 3.64 శాతం మూడు డీఏలు కలిపి 10.92 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో 3.64 శాతం డీఏ మంజూరు చేయాల్సి ఉన్నది. అదీ కలిపితే 14.56 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ప్రక్రియ సమీపిస్తుండడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 317 జీవోను సమీక్షించి బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు.సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోపు పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పీఆర్సీ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. వాటి సమర్పణకు గడువు సోమవారం వరకు గడువున్నది. పీఆర్సీ కమిటీ వాటిని క్రోఢకీరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను పరిశీలించి సిఫారసులను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

డీఏ బకాయిలను విడుదల చేయాలి
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న మూడు వాయిదాల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెండింగ్‌ బిల్లులన్నీ మంజూరు చేయాలని చెప్పారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు.
చావ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు డీఏ ప్రకటించాలి
ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు చెల్లించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను ప్రకటించాలని కోరారు. ఏడాదికిపైగా ఉద్యోగులు వాటికోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
మారం జగదీశ్వర్‌, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి