రోసా లక్సెంబర్గ్… జర్మన్ విప్లవకారిణి. అనేక విప్లవ సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. పోలిష్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, స్పార్టకస్ లీగ్, జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీలు స్థాపించి శ్రామికుల పక్షాన నిలిచారు. రాజకీయ సిద్ధాంతకర్తగా, మార్క్సిజం, మానవతావాద సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయంలో తన వంతు కృషి చేశారు. ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని అంతర్జాతీయంగా సాధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మరో నాలుగు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న తరుణంలో ఆమె జయంతి కూడా రావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
రోసా 1871, మార్చి 5వ తేదీనా రష్యా పాలనలో ఉన్న పోలాండ్‌లోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఐదుగురు పిల్లలలో రోసా అందరికంటే చిన్నది. జార్ చక్రవర్తి నియంతృత్వ పాలను వ్యతిరేకంగా ఆనాడు ఎన్నో ఉద్యమాలు జరిగేవి. ఆడా, మగా తేడా లేకుండా ఎంతో మంది ఆ ఉద్యమాలకు ప్రభావితమయ్యారు. అలాంటి వారిలో రోసా కూడా ఒకరు. ఆమె హైస్కూల్‌లో ఉండగానే రహస్య ఉద్యమాల్లో పాల్గొనేది. అంతే కాదు జైలు జీవితం కూడా అనుభవించింది. అనేక నిర్భంధాల వల్ల 1889లో జ్యూరిచ్‌కు వలసవెళ్లింది. అక్కడే లా అండ్ పొలిటికల్ ఎకానమీ పూర్తి చేసి 1898లో డాక్టరేట్ పొందింది.
అంతర్జాతీయవాదాన్ని నొక్కి చెప్పింది
జ్యూరిచ్‌లో రోసా అంతర్జాతీయ సోషలిస్ట్ ఉద్యమంలో పాల్గొంది. అక్కడే వాలెంటినోవిచ్ ప్లెఖనోవ్ , పావెల్ ఆక్సెల్రోడ్ వంటి రష్యన్ సోషల్ డెమోక్రటిక్ ఉద్యమ నాయకులను కలిసింది. అయితే అతి తక్కువ కాలంలోనే ఆమె వారితో విభేదించింది. తర్వాత తన తోటి విద్యార్థి లియో జోగిచెస్‌తో కలిసి పని చేసింది. పోలిష్ సోషలిస్ట్ పార్టీని, పోలిష్ స్వాతంత్య్రానికి మద్దతు ఇచ్చినందుకు ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. సహచరులు ఆమెను సవాలు చేస్తూ పోలిష్ సోషల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఇది తర్వాత పోలిష్ కమ్యూనిస్ట్ పార్టీకి కేంద్రంగా మారింది. అయితే ఆమె జాతీయవాద ఆకాంక్షలను తక్కువగా అంచనా వేసి సోషలిస్ట్ అంతర్జాతీయవాదాన్ని నొక్కి చెప్పింది. ఇది లెనిన్ సిద్ధాంతంతో ఆమె విభేదించే ప్రధాన అంశాలలో ఒకటి.
తిరస్కరణకు గురయ్యింది
1898లో ఆమె జర్మన్ పౌరసత్వం పొందేందుకు గుస్తావ్ లుబెక్‌ను వివాహం చేసుకుంది. తర్వాత రెండవ ఇంటర్నేషనల్‌లోని అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన పార్టీతో కలిసి పనిచేయడానికి బెర్లిన్‌లో స్థిరపడింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు, పార్లమెంటరీ రాజకీయాలను ఉపయోగించి క్రమబద్ధమైన విధానం ద్వారా సోషలిజాన్ని వేగంగా సాధించవచ్చని ఆమె వాదించింది. అయితే దీని కోసం ఆమె రాసిని సోజియల్ రిఫార్మ్ తిరస్కరణకు గురయ్యింది. దీనిలో ఆమె మార్క్సిస్ట్ సనాతన ధర్మాన్ని, విప్లవం ఆవశ్యకతను సమర్థించింది. పార్లమెంటు ఒక బూర్జువా బూటకం తప్ప మరేమీ కాదని వాదించింది. రెండవ అంతర్జాతీయ సిద్ధాంతకర్త అయిన కార్ల్ కౌత్స్కీ ఆమెతో ఏకీభవించారు.
అనుభవాల నుండి పాఠాలు
1905 నాటి రష్యన్ విప్లవం రోసా జీవితాన్ని మరో మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ప్రపంచంలో విప్లవం పుట్టే దేశం కేవలం జర్మనీ మాత్రమే అని ఆమె అప్పటి వరకు నమ్మింది. అయితే రష్యా కూడా విప్లవానికి మంచి అవకాశం ఉన్న దేశం అని ఆమె అప్పుడే అర్థం చేసుకుంది. వార్సా వెళ్లి పోరాటంలో పాల్గొని జైలు పాలైంది. ఈ అనుభవాల నుండి ఆమె ఎన్నో నేర్చుకుంది. వాటి ద్వారా ఆమె మాసెన్‌స్ట్రీక్, పార్టీ అండ్ గెవెర్క్స్‌చాఫ్టెన్(1906 సామూహిక సమ్మె, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాలు) రచించింది. సోషలిజం విజయాన్ని సాధించాలంటే అతి ముఖ్యమైన సాధనం సమ్మె అని ఆమె పూర్తిగా నమ్మింది. సమ్మె మాత్రమే కార్మికుల డిమాండ్లను పరిష్కరించగలదు అని ఆమె అనేది. ఆమె దృష్టిలో అదే విప్లవాన్ని ముందుకు నడిపిస్తుంది. పోరాటం నుండి సంస్థలు సహజంగా ఉద్భవిస్తాయని నమ్ముతూ, పార్టీ నిర్మాణం, అవసరాన్ని ఆమె నొక్కిచెప్పేది. దీనికిగాను ఆమె అనేక విమర్శలు ఎదుర్కొవలసి వచ్చింది.
శ్రామికవర్గ ప్రభుత్వానికై…
వార్సా జైలు నుండి విడుదలైన తర్వాత రోసా బెర్లిన్‌లోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ పాఠశాలలో రాజకీయ తరగతులు బోధించింది. అక్కడే డై అక్కుములేషన్ డెస్ క్యాపిటల్స్ (1913 మూలధన సంచితం) రచించింది. ఈ విశ్లేషణలో ఆమె ప్రపంచంలోని అభివృద్ధి చెందని ప్రాంతాలకు పెట్టుబడిదారీ విధానాన్ని విస్తరింపజేసింది. ఈ సమయంలోనే ఆమె సామూహిక కార్యక్రమాల కోసం ఉద్యమించడం ప్రారంభించింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ జర్మన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అయితే రోసా దీన్ని వ్యతిరేకించింది. అప్పుడే స్పార్టకస్ బండ్‌ను ఏర్పాటు చేసింది. ఇది విప్లవం ద్వారా యుద్ధాన్ని ముగించి శ్రామికవర్గ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం అంకితమై పని చేసింది. ఈ సంస్థ సైద్ధాంతాన్ని (1916 ది క్రైసిస్ ఇన్ ది జర్మన్ సోషల్ డెమోక్రసీ) రోసానే స్వయంగా జూనియస్ అనే మారుపేరుతో జైల్లో ఉన్నప్పుడు రాసింది. అదే సమయంలో యుద్ధం విషయంలో ఆమె లెనిన్‌తో ఏకీభవించింది.
రాజకీయ అధికారం కోసం
నవంబర్, 1918లో జైలు నుండి విడుదలైన రోసా, లైబ్‌నెచ్ట్ అనేక ఆందోళనా కార్యక్రమాల్లో భాగమయ్యారు. ఆ సమయంలో వారిద్దరు ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. బెర్లిన్‌లో జరిగిన అనేక సాయుధ పోరాటాలకు నాయకత్వం వహించారు. ఫలితంగా రోసా గురించి బూర్జువా ప్రెస్‌లో ‘బ్లడీ రోసా’ అంటూ దూషించారు. బోల్షెవిక్‌ల మాదిరిగానే రోసా, లీబ్‌నెచ్ట్‌లు కార్మికుల, సైనికుల సోవియట్‌లకు రాజకీయ అధికారాన్ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1918 చివరలో వారు జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే రోసా ఈ కొత్త సంస్థలో బోల్షెవిక్ ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఆమె డై రస్సిష్ రివల్యూషన్(1922 రష్యన్ విప్లవం) లెనిన్ పార్టీని, దాని వ్యవసాయ, జాతీయ స్వీయ నిర్ణయాలను విమర్శించింది. రోసా ఎప్పుడూ లెనిన్ ప్రజాస్వామ్య కేంద్రీకరణకు వ్యతిరేకంగా మాట్లాడేది. అయితే ఆ వ్యతిరేకత ఆమె కొత్త పార్టీపై ప్రభావం చూపలేదు. ఏది ఏమైనా రోసా ఆనాటి జార్ చక్రవర్తి నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించింది. అలాగే మహిళల ఆనాటి దుస్థితికి వ్యతిరేకంగా వారిని ఏకం చేసేందుకు, రాజకీయ చైతన్యం నింపేందుకు, ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషి చేసింది. క్లారా జెట్కిన్‌తో పాటు మహిళలకు ఓ ప్రత్యేకమైన రోజు అవసరమంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. 1919 జనవరి 15న ఆమె బెర్లిన్‌లో మరణించింది.