– బెదిరింపులు, దాడులతో విరాళాలు దుండుకుంది
– వరంగా మారిన ఎన్నికల బాండ్ల పథకం
– రూ.40 కోట్ల కప్పం చెల్లించుకున్న ఐఎఫ్‌బీ ఆగ్రో
కొల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కంపెనీలను బెదిరించి, భయపెట్టి, దాడులు చేయించి విరాళాలు దండుకుంటోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని ఆసరాగా చేసుకొని పార్టీ ఖాతాలో నిధులను జమ చేయించుకుంటోంది. విధిలేని పరిస్థితులలో ఆయా కంపెనీలు మమతకు కప్పం చెల్లిస్తూ తమ వ్యాపారాలు కొనసాగించాయి. మమత ప్రభుత్వ బాధితురాలైన ఐఎఫ్‌బీ ఆగ్రో సంస్థ గత నెలలో బయటపెట్టిన వాస్తవాలను పరిశీలిస్తే ఈ బాగోతం బయటపడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల కాలంలో రాజకీయ పార్టీలకు రూ.40 కోట్ల విరాళం అందజేశానని, అందుకోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశానని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఎఫ్‌బీ ఆగ్రో కంపెనీ తెలిపింది. అదే కాలంలో పన్ను చెల్లింపుల తర్వాత తాను రూ.13.87 కోట్ల లాభాలు ఆర్జించానని, పార్టీలకు అందించిన విరాళం దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నదని చెప్పింది. ఈ కంపెనీ రాష్ట్రంలో స్వదేశీ తయారీ విదేశీ మద్యాన్ని (ఐఎంఎఫ్‌ఎల్) తయారు చేస్తోంది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో సముద్ర ఆహార ప్రాసెసింగ్ లేదా రొయ్యల పెంపకం రాజకీయ, సామాజిక దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు రొయ్యల చెరువుల కోసం వ్యవసాయ భూములను బల వంతంగా స్వాధీనం చేసుకోవడం, మహిళలను లైంగికంగా వేధించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అధికార పార్టీకే…
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల బాండ్ల కొనుగోలు కోసం రూ.40 కోట్లు చెల్లించేందుకు 2022లో ఐఎఫ్‌బీ ఆగ్రో ఆమోదం తెలిపిందని వార్తలు వచ్చాయి. ఆ సంవత్సరంలో ఎన్నికల బాండ్ల కొనుగోలుకు రూ.18.30 కోట్లు చెల్లించారు. 2023 ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం లో రూ.40 కోట్లు చెల్లించారు. ఈ కంపెనీ తన వెబ్‌సైట్ లోనూ, స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లోనూ ఎన్నికల బాండ్ల కొనుగోలుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఫైలింగ్స్‌లో ఎన్నికల బాండ్లపై ప్రకటన చేసిన తొలి కంపెనీ ఇదే. అయితే ఏ పార్టీకి విరాళం ఇచ్చిందీ చెప్పన ప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిపిన సంభాషణలను బట్టి అధికార పార్టీకే విరాళం అందించినట్లు అర్థమవుతోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకే అంటున్న కంపెనీ
ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల మేరకే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశామని గత సంవత్సరం జూలై 31న జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఓ వాటాదారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విక్రమ్‌జిత్ నాగా చెప్పారు. గతంలో ఎన్నడూ అలా చేయలేదని, ఇప్పుడు చేయాల్సి వస్తోందని కూడా తెలిపారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయాల్సి రావడం వల్లనే రాష్ట్రం వెలుపల పెట్టుబడులు పెడుతున్నా మని అన్నారు. ‘దీనిపై ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేశారం. ముఖ్యమంత్రికి అనేక సార్లు లేఖలు రాశాం. అది ఆమె నిర్ణయమే. ఆమె మనకు సమయం కూడా ఇవ్వలేదు’ అని వివరించారు. కాగా కంపెనీ ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందించామని 2022 ఏప్రిల్ 1న కంపెనీ ఎన్‌ఎస్‌ఈకి తెలిపింది.
దాడులు…వేధింపులు
జరిగిన తతంగాన్ని 2022 ఏప్రిల్‌లో ఆర్థిక పాత్రికే యురాలు, మార్కెట్ విశ్లేషకురాలు సుచేతా దలాల్ పూసగు చ్చినట్లు వివరించారు. 150 మంది సాయుధ గూండాల దాడి కారణంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నూర్ పూర్ డిస్టిలరీని తాత్కాలికంగా మూసివేస్తున్నామని జాతీ య స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)కి ఐఎఫ్‌బీ ఆగ్రో తెలియ జేసింది. డిస్టిలరీని మూసేయాలని, ఫ్యాక్టరీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఉద్యోగులను గూండాలు హెచ్చరించారు. దీనిపై కంపెనీ కేసు పెట్టింది. జోక్యం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరింది. నూర్‌పూర్ డిస్టిల రీ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. దానికి మమత అల్లుడు అభిషేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నా రు. 2020 జూన్ 26న ఈ డిస్టిలరీలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాడి ఘటనపై అప్పటి రాష్ట్ర గవ ర్నర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ కోరారు.
కంపెనీ ప్రయోజనాల కోసం…
బెంగాల్‌లో తాను నిర్వహిస్తున్న మద్యం వ్యాపారానికి ముప్పు కలుగుతోందని 2021 జనవరిలో కంపెనీ తెలిపింది. కొందరు ఎక్సైజ్ అధికారుల చట్టవిరుద్ధమైన డిమాండ్ల కారణంగానే తమ వ్యాపారానికి విఘాతం ఏర్పడుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో కంపెనీ, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2021-22లో ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా రాజకీయ పార్టీలకు రూ.25 కోట్ల విరాళం అందించాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించిందని 2021 అక్టోబర్ 7న ప్రకటించింది. 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనే ఈ కంపెనీ రూ.12 కోట్ల విరాళాలు అందించింది.
ఇటీవల న్యూస్‌మినిట్, న్యూస్‌లాండ్రీ పోర్టళ్లు సంయుక్తంగా ఓ విచారణ నివేదికను ప్రచురించాయి. ఈడీ, ఐటీ శాఖల విచారణలను ఎదుర్కొంటున్న 30 సంస్థలు బీజేపీకి రూ.335 కోట్ల విరాళం అందించాయని దాని సారాంశం. వీటిలో కనీసం ఆరు సంస్థలు ఆ పార్టీకి తరచుగా విరాళం అందజేశాయి. సోదాలు జరగ్గానే బీజేపీ ఖాతాలో సొమ్ము జమ చేశాయి.