– ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ ప్రారభం
– ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభం..
– 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
– పెద్దన్నలా సహకారం అందించాలి : సీఎం రేవంత్
– పీఎంకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి సీతక్క
నవతెలంగాణ – ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. తెలంగాణలో గడిచిన పదేండ్లలో రూ.వేల కోట్ల పనులు ప్రారంభించినట్టు చెప్పారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటుచేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన.. చేపట్టాల్సిన రూ.6697 కోట్ల అభివృద్ధి పనులతో పాటు దేశవ్యాప్తంగా రూ.56వేల కోట్లతో చేపడుతున్న పలు ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభో త్సవాలు చేసిన ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించామని, దీంతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు.
అభివృద్ధికి ఘర్షణ వైఖరి ఆటంకం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది కానీ 1600 మెగావాట్లకే పరిమితమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రోకు, మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బుగుప్తా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం), సీసీఐ నాయకుల అరెస్ట్
జిల్లాకు ఇచ్చిన హామీలపై మాట్లాడని మోడీ : నేతల ఆగ్రహం
ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో సోమవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పూసం సచిన్‌తో పాటు సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ అరవింద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని వేర్వేరు పోలీస్టేషన్లకు తరలించారు. జిల్లాకు వచ్చిన మోడీ ప్రజలు కోరుతున్న సీసీఐ పరిశ్రమ పున:ప్రారంభం, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ మంజూరు, విమానాశ్రయ నిర్మాణం, గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుపై మాట్లాడకుండా.. వేరే జిల్లాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్రారంభించారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులూ మంజూరు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ పదేండ్ల కాలంలో జిల్లాలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు. అయినప్పటికీ జిల్లా ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించారని, జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.