– నగదు, సెల్ ఫోన్లు ఎత్తుకుపోయిన దొంగలు
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలో ఓ మొబైల్ షాప్ లో సినీ పక్కిలో గోడకు కన్నం వేసి చోరీ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్ లో శ్రీ వెంకటేశ్వర మొబైల్స్ షాప్ లో రాత్రి షాపు వెనుక భాగంలో ఏకంగా గోడకు కన్నo వేసి చోరి చేసి నగదు, సెల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు.అయితే ఈ మొబైల్ షాప్ లోనే గత నెల 25న కూడా చోరీ చేయడానికి దొంగలు ప్రయత్నించిన వీడియోలు సీసీ ఫుటేజ్ లో కనిపించాయి. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా మొబైల్ షాప్ లో సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కత్తిరించారు. ఈ చోరీ ఘటనలో సుమారు నాలుగు లక్షల వరకు నగదు, సెల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్టు యజమాని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.