కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజాపాలన

నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సహకారంతో విద్యార్థులకు కంప్యూటర్లు, ఆటవస్తులు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించింది దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. మండల అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అధిక శాతం  అమలవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిఓ రాంమ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.