ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే సినిమా

వెంకట శివ సాయి పిల్మ్స్‌ పతాకంపై మణికొండ రంజిత్‌ సమర్పణలో సత్యరాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. రవితేజ నున్నా హీరోగా, నేహ జురెల్‌ హీరోయిన్‌గా నటించారు. రామిశెట్టి వెంకట సుబ్బారావు, కలవకొలను సతీష్‌ సహ నిర్మాతలు. ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో రవితేజ, దర్శకుడు సత్యరాజ్‌ మీడియాకి చిత్ర విశేషాలను తెలియజేశారు. దర్శకుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ, ‘హీరోయిన్‌ని ఎవరు హత్య చేశారనే పాయింట్‌తో ఎంతో ఇంటెన్స్‌గా కథ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లోకి ముత్యాల రామదాసు వచ్చాక సినిమా స్వరూపమే మారిపోయింది. చిన్న సినిమా కాస్తా పెద్ద సినిమా అయిపోయింది. సంగీత దర్శకుడు రోషన్‌ పెద్ద సినిమాలకు సంగీతం ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఇచ్చాడు. నేపథ్య సంగీతం అయితే మణిశర్మ స్థాయిలో ఉంటుంది. ఇది కులాల నేపథ్యంలో తీసిన సినిమా కాదు. రెండు కుటుంబాల మధ్య జరిగే ఇంటెన్స్‌ స్టోరీ ఇది’ అని తెలిపారు. ‘నటనని స్వతహాగా నేర్చుకుంటూ, దర్శకుల సలహాలు పాటిస్తుంటాను. ఈ సినిమాలో దర్శకుడు సత్య నా నుంచి ఆయనకు కావాల్సిన నటనను బాగా రాబట్టుకున్నారు.ఈ సినిమాలో నేను పోషించిన పాత్రకు అందరూ బాగా కనెక్ట్‌ అవుతారు’ అని హీరో రవితేజ చెప్పారు.