– ఆయనతో పాటు మరో ఐదుగురికి విముక్తి
– బాంబే హైకోర్టు తీర్పు
– పదేండ్ల పోరాటం తరువాత న్యాయం: ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత కుమారి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో 90 శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ముంబాయి హైకోర్టు (నాగపూర్ ధర్మాసనం) నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 54 ఏండ్ల సాయిబాబాతో పాటు మరో ఐదుగురు మహేష్ తిర్కి, హేమ్ మిశ్రా, పాండు నారోట్, విజరు తిర్కి, ప్రశాంత్ రహీని 2017 మార్చిలో సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును జస్టిస్ వినరు జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్.ఎ మెనిజేస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం పక్కన పెట్టింది. నిందితులపై ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొంది. అందువల్లే సాయిబాబాను, మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని, వారిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తున్నా మని తెలిపింది. యూఏపీఎ కింద నిందితుల్ని బుక్ చేయాలని చేసిన ప్రతిపాదనను కూడా కోర్టు కొట్టేసింది. రూ.50 వేల పూచీకత్తుపై నిందితులను విడుదల చేయాలని ధర్మాసనం తెలిపింది. మరోవైపు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన కొన్ని గంటల తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును సంప్రదించింది.
దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కు పరిమితమైన సాయిబాబా, మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్ కోర్టు.. నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2022 అక్టోబర్ 14న వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 అక్టోబర్ 15న విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో ప్రత్యేక ధర్మాసనం నిందితుల విడుదలపై స్టే విధించింది. వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. అనంతరం, సుదీర్ఘ విచారణ తరువాత, 2023 ఏప్రిల్ 19న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తీర్పును పక్కన పెట్టి, తాజా పరిశీలన కోసం ఈ విషయాన్ని హైకోర్టుకు రిమాండ్ చేసింది. వారి అప్పీల్ పై మళ్లీ మొదటి నుంచీ విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ముంబాయి హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా.. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్శిటీ సస్పెండ్ చేసింది. 2021 మార్చి 31న ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. అయితే, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు జస్టిస్ రోహిత్ డియో 2023 ఆగస్టు 2న హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు.
పదేండ్ల పోరాటం తరువాత న్యాయం: ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత కుమారి
పదేండ్ల పోరాటం తరువాత తమకు న్యాయం జరిగిందని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత కుమారి అన్నారు. తన భర్త ప్రతిష్టను ఎప్పుడూ పణంగా పెట్టలేదని, ఆయనకి తెలిసిన వ్యక్తులు ఆయనను నమ్ముతున్నారని తెలిపారు. పోరాటంలో సాయిబాబాకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సాయిబాబా విడుదల పట్ల ఐలు హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ ద్రోహ చట్టం కింద ఎంతో కాలంగా జైల్లో మగ్గుతున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతోపాటు, మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడం పట్ల ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర కమిటీ హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె పార్థసారధి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి కేసులో ఇరికించి జైలు పాలు చేసిందని తెలిపారు. ఇన్ని రోజుల తర్వాత న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలకు ఎందరో అమాయకులు బలవుతున్నారని తెలిపారు. ఈ కుట్రకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇన్నేండ్లపాటు జైలు శిక్ష అనుభవించినందుకు పెద్దమొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కోర్టులను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలనీ, ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.