కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎం..

– వారి అవినీతిని కాంగ్రెస్‌ ఎంత కాలం కాపాడుతుందో చూస్తం: పటాన్‌చెరు బహిరంగ సభలో ప్రధాని మోడీ
– రూ.7200 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
– ఘట్‌కేసర్‌-లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్‌ రైల్‌ షురూ
– సివిల్‌ ఏవియేషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌, గ్యాస్‌ పైప్‌లైన్‌, హైవేలు జాతికి అంకితం
– పలువురు సీపీఐ(ఎం) నాయకుల ముందస్తు అరెస్టు
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
”బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ది అవినీతి బంధం. కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారింది. బీఆర్‌ఎస్‌ అవినీతిని కాంగ్రెస్‌ ఎంత కాలం కాపాడుతుందో చూస్తం. అది ఎక్కువ కాలం నిలవదు..” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ ప్రజలు చూపుతున్న ప్రేమ, విశ్వాసం, నమ్మకాన్ని దుర్వినియోగం చేయబోనన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పటేల్‌ గూడెం మైదానంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి సభాస్థలికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన మోడీకి రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌, కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ.7200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన, చేపట్టనున్న వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.333 కోట్ల వ్యయంతో చేపట్టిన పరదీప్‌ హైదరాబాద్‌ గ్యాస్‌ పైప్‌ను జాతికి అంకితం చేశారు. రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించిన సివిల్‌ ఏవియేషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను మోడీ ప్రారంభించారు. రూ.1165 కోట్ల వ్యయంతో ఘట్‌కేసర్‌-లింగంపల్లి మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైల్‌ను మోడీ జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.1408 కోట్ల నిధులతో కంది రాంసాన్‌పల్లి, మిర్యాలగూడ-కోదాడ రెండో లైన్‌ జాతీయ రహదారిని కూడా ప్రారంభించారు.
అదే విధంగా పూణే-హైదరాబాద్‌ రహదారిలో సంగారెడ్డి మీదుగా మదీనాగూడ ఆరులైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. మెదక్‌, ఎల్లారెడ్డి రెండో లైన్‌హైవే విస్తరణ, ఎల్లారెడ్డి రుర్రూర్‌ హైవే పనులకూ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఎటీఎంగా మారిందన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతిని కాంగ్రెస్‌ కాపాడుతూ వస్తుందని, అది ఎంతో కాలం నిలవదన్నారు. బీజేపీలో యువతకు అవకాశాలు వస్తుండటంతో రాష్ట్రంలోని కుటుంబ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. తన కంటూ సొంత ఇల్లు కట్టుకోలేకపోవచ్చు కానీ.. దేశంలో ఇండ్లులేని కోట్ల మందికి ఇండ్లు కట్టించానని గుర్తు చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. కార్యక్రమంలో ఎంపీలు లక్ష్మణ్‌, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ క్రాంతి వల్లూరి, ఎస్పీ రూపేష్‌, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) నాయకుల ముందస్తు అరెస్టు
ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అకారణంగా పలువురు సీపీఐ(ఎం) నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సోమవారం రాత్రి సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎం.యాదగిరిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్బంధించారు. సంగారెడ్డిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎం.యాదగిరి, నర్సింతో పాటు పటాన్‌చెరులో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు, వాజీద్‌లను కూడా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) నాయకుల్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.
ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజ్‌ ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అనేక రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణానికి నిధులివ్వకుండా, ఇప్పుడు రాజకీయ ప్రచారం కోసం శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్‌-నారాయణఖేడ్‌-బీదర్‌ రైల్వే లైన్‌ నిర్మాణం కోసం 2010, 2015లో సర్వే చేసినప్పటికీ ఇప్పటికీ గతిలేదన్నారు. నిజాంపేట్‌-బీదర్‌ లైన్‌కు రూ.513 కోట్లు కేటాయించినా పనుల్లో ప్రగతిలేదని ఆరోపించారు. నిమ్జ్‌ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందన్నారు.