
– భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మల్లన్న స్వామి
– ఎక్వాయిపల్లి మల్లన్న గుట్టపై ఏర్పాట్లు ముమ్మరం
నవతెలంగాణ – ఆమనగల్
కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామం సమీపంలో ఉన్న మల్లప్ప గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈనెల 12 వరకు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎత్తుకొండపై వెలసిన మల్లన్న స్వామికి ప్రతి శివరాత్రికి జాతర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలకు మండల వాసులతో పాటు కల్వకుర్తి, ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, యాచారం, మాల్, చింతపల్లి, చరికొండ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ఆలయ ప్రధాన ధర్మకర్త ఎట్టయ్య యాదవ్ వివరించారు.
ఉత్సవ వివరాలు: 8న గణపతి పూజ, పంచామృతాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, ఒగ్గు కథ, 9న అగ్నిగుండాలు, 10న ప్రత్యేక పూజలు, రథోత్సవం, 11న అర్చనలు, విశేష పూజలు, దోపోత్సవం, ఒగ్గు కథ, 12న చక్రతీర్థం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఉత్సవాల నిర్వాహకులు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.