కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంపు

For Central Govt Employees 4 percent increase in DA– ఉజ్వల పథకం కింద గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ గడువు పొడిగింపు : కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం
– పెట్టుబడిదారుల ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం
– లోక్‌సభ ఎన్నికల ముందు మోడీ సర్కార్‌ తాయిలాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 4 శాతం పెరిగింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 46 శాతం డీఏ 50శాతానికి చేరుకుంటుంది. పెంపు 2024 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌ తెలిపారు. తాజా నిర్ణయంతోదాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారని అన్నారు. గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌ మాట్లాడారు.ఉజ్వల లబ్దిదారులకు వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం ఇస్తున్న రూ.300 సబ్సిడీని ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికీ ఈ రాయితీని వర్తింప జేసింది. ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్‌ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పది కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై రూ.12 వేల కోట్ల భారం పడనుందని చెప్పారు.
పెట్టుబడిదారుల ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం
ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పదేండ్ల పాటు ఉత్తర్‌ పూర్వ రూపాంతర పారిశ్రామికీకరణ పథకం-2024 కోసం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం ప్రతిపాదనను ఆమోదించింది. మొత్తం రూ.10,037 కోట్లతో నిర్వహించనుంది. కొత్త యూనిట్లను స్థాపించడానికి, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణను చేపట్టడానికి పెట్టుబడిదారులకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి.
ముడి జూట్‌కు కనీస మద్దతు ధర
2024-25 సీజన్‌ కోసం ముడి జూట్‌కు కనీస మద్దతు ధరలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. 2024-25 సీజన్‌లో రా జూట్‌ ఎంఎస్‌పి (టిడిఎన్‌-3 మునుపటి టిడి-5 గ్రేడ్‌కి సమానం) క్వింటాల్‌కు రూ.5,335గా నిర్ణయించింది. ఇది మొత్తం దేశ సగటు ఉత్పత్తి వ్యయం కంటే 64.8 శాతం రాబడిని నిర్ధారిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. కమీషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2024-25 సీజన్‌కు ఎంఎస్‌పీ గత సీజన్‌తో పోలిస్తే ముడి జూట్‌కి క్వింటాల్‌కు రూ.285 పెరిగింది. ప్రస్తుత సీజన్‌ 2023-24లో, ప్రభుత్వం రూ.524.32 కోట్లతో 6.24 లక్షల కంటే ఎక్కువ ముడి జూట్‌లను రికార్డు స్థాయిలో సేకరించింది. దీనివల్ల దాదాపు 1.65 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. జ్యూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జేసీఐ) ప్రైస్‌ సపోర్టు కార్యకలాపాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీగా కొనసాగుతుంది. అటువంటి కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్‌ చేస్తుందని అని అన్నారు.