– కాలువలకు నీరు విడుదల చేయాలని డిమాండ్
నవతెలంగాణ-మంథని
సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు అధికారులు వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని పాత పెట్రోల్ బంకు ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. ఎస్సారెస్పీ డి-83 కాలువ పరిధిలోని కాకర్లపల్లి, రామకృష్ణాపూర్, మైదుపల్లి, సూరయ్యపల్లి, గాజులపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో యాసంగి వరి సాగు చేసామని, కీలక దశలో పంటలకు నీరు లేక ఎండిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా పొలాలు ఎండిపోయాయని, వెంటనే కాలువ నీరు విడుదల చేస్తే సగం మేరకైనా పంటలైనా చేతికందుతాయని అన్నారు. కాలువ నీళ్లు రావని ముందే చెప్తే యాసంగిలో వరి పంట వేసే వాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మంథని సీఐ, ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. కానీ, తమకు నీటి విడుదలపై సంబంధిత అధికారులు స్పష్టతిచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు.
సాగునీరు అందించి పంటలు కాపాడకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. దాంతో మంథని ఆర్డీవో హనుమ నాయక్ వచ్చి రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాలువ నీరు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.