విధానపర అంశాలు మరిచి వ్యక్తిగత దూషణలు

Forget policy issues and make personal insults– మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం రేవంత్‌రెడ్డి విధానపర అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు బహిరంగసభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డకాడనీ, చంద్రబాబు పెంపుడు బిడ్డఅనీ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, టీఆర్‌ఎస్‌ నేత నాగేందర్‌ గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తన పక్కనున్నవారితో రేవంత్‌కు ముప్పు ఉందనీ, అందుకే కేసీఆర్‌ పేరు పెట్టి వారిని తిడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీం కోర్టులు సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు మీద ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోడీ సభలో జాతీయహౌదా కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో సర్వం నష్టపోయిన పాలమూరుకు సాగునీళ్లు, ఐదు మొడికల్‌, ఒక ఫిషరీస్‌ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్‌ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరెంటు, రవాణా, ట్రాఫిక్‌ అన్ని రంగాల్లో నిస్తేజం నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి 55 సీట్లు కూడా వస్తాయో? రావో తెలియదన్నారు. కాంగ్రెస్‌ చిన్నసైజు ప్రాంతీయ పార్టీ అని విమర్శించారు.
రేవంత్‌రెడ్డికి మోడీ పెద్దన్న అయితే రాహుల్‌ గాంధీ ఏం అవుతాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలిచ్చి 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పినందుకు రేవంత్‌, కాంగ్రెస్‌ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు కేసీఆర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హుందాగా మాట్లాడాలనీ, లేకుంటే జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని హెచ్చరించారు.