
గల్ఫ్ దేశం బెహరన్ లో ఉపాధి కోసం వెళ్ళిన 20 సంవత్సరాల యువకుడు లొక్కిడి రాఘవేందర్ అక్కడ క్లీనింగ్ పనిలో చేరిన కొన్ని నెలలకే గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడిని కలిసినారు. ఒక క్లీనింగ్ కంపెనీలో పని దొరికింది కదా అని ఇక్కడ వికలాంగుడైన తండ్రి, తల్లి, తమ్ముడు సంతోషిస్తున్న సమయంలో తాము నమ్ముకున్న బిడ్డ అకాల మరణ వార్త వినవలసి రావడం కుటుంబానికి తీరని లోటు, ఎవరు తీర్చలేని బాధ మిగిలింది. విషయం తెలిసిన వెంటనే తమ బిడ్డ మృతదేహాన్ని త్వరగా ఇంటికి రప్పించాల్సిందిగా అభ్యర్థించారు. కోటపాటి వెంటనే స్పందించి బెహరన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు, అక్కడి తెలుగు సంఘం తెలుగు కళా సమితి అధ్యక్షుడు మురళి గారికి వివరాలు పంపి తగిన సహాయం చేసి మృతుని శవాన్ని తొందరగా పంపే ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. వారు స్పందించి దానికి కావలసిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోటపాటిని కలిసిన వారిలో మృతుని తమ్ముడు లతీష్ బడా భీంగల్ గల్ఫ్ కార్మిక నాయకుడు ఈర్ల సాయి బాబా, గడ్డం శ్రీకాంత్, మారుతీలు ఉన్నారు.