ఎలక్షన్‌ కమిషనర్‌ రిజైన్‌

Election Commissioner resigns– రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– చర్చనీయాంశంగా మారిన అంశం
– గతనెలే మరో కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ
– ముగ్గురు సభ్యుల ఈసీఐలో ప్రస్తుతమున్నది సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే
– దగ్గరపడుతున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన తన పదవి నుంచి తప్పుకోవటం సంచలనం రేపింది. ఆయన పదవీ కాలం మరో మూడేండ్లు ఉన్నది. అయినప్పటికీ.. ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీ నామా వెనక గల కారణం ఏమిటో మాత్రం తెలియరాలేదు. కాగా, అరుణ్‌ గోయెల్‌ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023లోని సెక్షన్‌ 11 క్లాజ్‌ 1 కింద అరుణ్‌ గోయెల్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినట్టు అందులో వివరించింది.
అరున్‌ గోయెల్‌ 1962, డిసెంబర్‌ 7న పాటియాలలో జన్మించారు. 2022, నవంబర్‌ 18న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు నిర్ణయించుకు న్నారు. అయితే, అదే నెల 21న ఆయన భారత ఎన్నికల కమిషనర్‌గా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టటం గమనార్హం. అప్పట్లో ఆయన నియామకాన్ని సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఆయన పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన 1985వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 37 ఏండ్లకు పైగా ఆయన సేవల ందించారు. 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించటం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఆయన పదవి నుంచి తప్పుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ముగ్గురు సభ్యుల భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) లో ఇప్పటికే గతనెల14న మరో కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండే(65) పదవీ విరమణ చేశారు. అనుప్‌ స్థానమే భర్తీ కాకుండా.. ఇప్పుడు అరుణ్‌ గోయెల్‌ సైతం తప్పుకోవటంతో ఈసీఐపై భారం పడనున్నదని నిపుణుల అంచన. ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లు లేకపోవటంతో ఈసీఐలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే సభ్యుడిగా ఉండటం గమనార్హం.
ఇప్పటికీ సమావేశం కాని ప్రధాని నేతృత్వంలోని
సెలక్షన్‌ ప్యానెల్‌
వచ్చే వారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్న ట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్లు లేకపోవటం ఈసీఐకి పెద్ద భారమేనని విశ్లేషకులు అంటున్నారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషన ర్లు (నియామకం, సేవానిబంధనలు,పదవీకాలం) బిల్లు, 2023, పార్లమెంటు ఆమోదించినప్పటి నుంచి ఎన్నికల కమిషనర్‌ను ఎన్నుకునే ఎంపిక ప్యానెల్‌ ఇంకా సమావేశం కాకపోవటం గమనార్హం.
దీంతో అనుప్‌ చంద్ర స్థానం ఖాళీగా ఉన్నది. దీనికి అరుణ్‌ గోయల్‌ రాజీనామా కూడో తోడయ్యింది. భార త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) స్థానంలో ప్రధాన మంత్రి ఎంపిక ప్యానెల్‌లో కేంద్ర క్యాబినెట్‌ మంత్రిని చేర్చటానికి కొత్త చట్టం సులభతరం చేసింది. ఈ చర్య ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలకు దారితీసింది. మోడీ, క్యాబినెట్‌ మిని స్టర్‌తో పాటు లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి కూడా ప్యానెల్‌లో సభ్యుడిగా ఉంటారు. కాగా, ఇంత తక్కువ సమయంలోనే ఇద్దరు కమిషనర్లు రాజీనామా చేయటంతో ఎలక్షన్‌ కమిషనర్లు లేకుండానే ఎన్నికలు జరగుతాయో లేదో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అంటున్నారు.
సీఈసీ, ఈసీల ఎన్నిక ఇలా..
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం ప్రకారం, ప్రధానమంత్రి నేతత్వంలోని ఎంపిక కమిటీ పరిశీలన కోసం.. న్యాయ మంత్రి నేతృత్వంలోని ఇద్దరు కేంద్ర కార్యదర్శులతో కూడిన సెర్చ్‌ కమిటీ ఐదుగురు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది. ఫిబ్రవరి 7న సెర్చ్‌ కమిటీ సమావేశం కావాల్సి ఉన్నది. అయితే, సమావేశం వాయిదా పడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెర్చ్‌ కమిటీలో యూనియన్‌ హౌం సెక్రెటరీ, పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగంలో సెక్రెటరీ సభ్యులుగా ఉన్నారు.