అనుమానాస్పదంగా ఇద్దరు చిన్నారులు మృతి

– పాలలో విషం కలిపినట్టు అనుమానాలు..?
నవతెలంగాణ-గార్ల
వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇద్దరు సంతానంతో చక్కగా జీవనం సాగిస్తున్నారు.. ఏమైందో తెలియదు ఒక్కసారిగా అ తల్లిదండ్రులు మానవత్వం మంటకలిసింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై విషప్రయోగం చేసి వారి చావుకు కారణమయ్యారు చిన్నారుల తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం గ్రామానికి చెందిన కందగట్ల అనిల్‌,దేవి దంపతులు.. బయ్యారం మండలం నామాలపాడులో తమ ఇద్దరు పిల్లలు లాస్య (3), లోహిత (1) తో కలిసి జీవిస్తున్నారు. వారం క్రితం అనిల్‌ తమ స్వగ్రామం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసి వచ్చారు. అతడి తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న తిరిగి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన వెంకన్న.. కొడుకు, కోడలు కనిపించకపోవడంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం అందిం చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ తిరుపతి, సీఐ రవి కుమార్‌, ఎస్‌ఐ జీనత్‌ కుమార్‌ మృతదేహాలను పరిశీలించారు. చిన్నారుల తాత వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జీనత్‌ కుమార్‌ తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారులు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.