కారు దిగి కమలం గూటికి..

– బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కు మార్గం సుగుమం అవుతుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్‌, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఆ దిశలో చాలా రాజకీయ పరిస్థితులు మారనున్నట్టు చెప్పారు. ఆదివారం నాడిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు గోడెం నగేష్‌, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌, కాంగ్రెస్‌ నేత గోమసే శ్రీనివాస్‌ లు బీజేపిలో చేరారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌, ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ సీనియర్‌ నేత పొంగులేటి వీరికి పార్టీ సభ్యత్వ రశీదు ఇచ్చి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ… దేశ వారసత్వ, అవినీతి రాజకీయ పార్టీలను చూసి ఆందోళనలో ఉందన్నారు. కేసీఆర్‌ తన పార్టీని బీఆర్‌ఎస్‌ కాకుండా… బాబా, బేటా, బేబీ(బీబీబీ) గా మార్చుకుంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. బీబీబీ పార్టీ పూర్తిగా అవినీతి పాలన చేసిందని విమర్శించారు. అందుకే ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారన్నారు.