– భారత కోస్ట్‌గార్డ్‌లో మహిళా అధికారులకు దానిని మంజూరు చేయాలి
– కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం భేష్ : విశ్లేషకులు, నిపుణులు
కొచ్చి: భారత కోస్ట్‌గార్డ్‌లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్(పీసీ)ను మంజూరు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయటంపై నిపుణులు, విశ్లేషకులు స్పందించారు. ఈ నిర్ణయం సరైనదేననీ వ్యాఖ్యానించారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ను న్యాయస్థానం అర్థం చేసుకున్నదని తెలిపారు. ఇది లింగ వివక్షను ఏ రూపంలోనైనా సహించేది లేదన్న కోర్టు అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. గత నెల 26న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు గట్టి సందేశం ఇచ్చింది. ప్రభుత్వం చేయకపోతే అందుకు అనుకూలమైన ఉత్తర్వు న్యాయస్థానం జారీ చేస్తుందని హెచ్చరించింది. మహిళలకు శాశ్వత కమిషన్లు మంజూరు చేయటంలో ”ఫంక్షనల్, ఆపరేషనల్ ఇబ్బందులు” ఉన్నాయని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఇచ్చిన వివరణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అలాంటి సాకులను ఇకపై ఉపేక్షించబోమని వివరించింది. సాయుధ బలగాలకు చెందిన మహిళా అధికారులకు వారి పురుష సహచరులతో సమానంగా పీసీని మంజూరు చేయాలని గతంలో నుంచే అనేక డిమాండ్లు ఉన్నాయి. లింగ-తటస్థ విధానాలను అమలు చేయటానికి అధికారులు విముఖత చూపటం, సంప్రదాయాల వెనుక దాగి ఉంటటం, మహిళలు కొన్ని పాత్రలకు తగినది కాదని చాలా కాలంగా ఉన్న నమ్మకాలను కోర్టు గుర్తించింది.
చారిత్రాత్మకంగా, సాయుధ దళాలు తమ ర్యాంకుల్లో మహిళలను నియమించుకోవటంలో నిదానంగా ఉన్నాయి. ఒకవేళ నియమితులైనవారు ఉన్నత ర్యాంక్‌లకు ప్రమోషన్, ఉద్యోగ భద్రత విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళాన్ని నియంత్రించే చట్టాలు మహిళలను కొన్ని పాత్రల నుంచి దూరంగా ఉంచడానికి స్పష్టమైన నిబంధనలను కలిగి ఉన్నాయి. వాటిని అధిగమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయితే 1990ల ప్రారంభంలో మాత్రమే చేతన ప్రయత్నాలు జరిగాయని నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.