– బీజేపీలో ఈటల టార్గెట్‌గా పావులు
– పార్టీకి రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్‌రెడ్డి
– అసహనంలో కూన శ్రీశైలంగౌడ్
– సొంతనేతల నుంచే ఈటలకు ఓటమిగండం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘చెప్పులోన రాయి చెవిలోన జోరీగ.. కంటిలోని నలుసు కాలిముల్లు..ఇంటిలోన పోరు ఇంతింతగాదయ…విశ్వదాభిరామ వినురవేమ’ అంటూ ఇంటిపోరులోని బాధను చాలా చక్కగా వివరించారు వేమన. సరిగ్గా ఈటల రాజేందర్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఆయనకు బయటిపోరు కంటే ఇంటిపోరే ఎక్కువైంది. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్‌రెడ్డి ఏకంగా బీజేపీకి ఆదివారం రాజీనామా చేశాడు. ఆయన అసంతృప్తిని పసిగట్టిన రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరిపేందుకు యత్నించగా ఆయన వారికి అందుబాటులో లేకుండా పోయారు. చివరకు పార్టీకే రాజీనామా చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశాడు. కూన కుతకుతలాడుతున్నాడు. ఆయన గనుక పార్టీని వీడితే బీజేపీ ఓటుబ్యాంకుకు భారీ గండి పడే అవకాశాలున్నాయి. దీనినిబట్టే తెలంగాణ ఉద్యమ సమయంలో డక్కీలుమొక్కీలు తిని నేతగా ఎదిగిన ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరిన తర్వాత ఏదీ కలిసిరావడం లేదని అర్ధమవుతున్నది. బయటి పార్టీల వాళ్ల కంటే సొంత పార్టీలోని నేతలకే ఆయన ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. బీఆర్‌ఎస్ తాజా ఎంపీ రంజిత్‌రెడ్డి అదే పార్టీ నుంచి మొదట మల్కాజిగిరి నుంచి పోటీచేయాలని భావించారు. కానీ, అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో దిగటంతో ఆయన వెనక్కి తగ్గారు. పౌల్ట్రీరంగంలోని స్నేహబంధంతో ఈటల కోసం రంజిత్‌రెడ్డి సీటును త్యాగం చేశారనే చర్చ రాజకీయాల్లో జోరుగా నడుస్తున్నది. ఇలా బయటి పార్టీ వాళ్లు ఏదోరకంగా సహకరిస్తుంటే బీజేపీలోని కీలక నేతలే ఈటల ఓటమి కోసం పావులు కదుపుతున్నట్టు, ఆ నేతల నుంచే ఈటలకు మరోమారు ఓటమి గండం ఉండనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీటు ఆశించి భంగపడిన నేతలంతా ఒక్కటై ఈటలకు వ్యతిరేకంగా గ్రూపుకట్టారు. ఆయన ఓటమి కోసం కొందరు ముఖ్యనేతలు తెరవెనుక పావులు కదుపుతుండగా…తెర ముందు కూనం శ్రీశైలంగౌడ్, తూళ్ల వీరేందర్‌గౌడ్ ముఖ్యంగా కనిపిస్తున్నారు.
మురళీధర్‌రావు వెనుకుండి చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షలు పన్నాల హరీశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, తదితరులున్నారు. వీరంతా ఈటలకు సహకరించే పరిస్థితి లేదు. ఈటల మాత్రం పార్టీ హార్డ్‌కోర్ శ్రేణులను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు లక్షలకుపైగా ఉన్న ఉత్తర భారతదేశం ఓటర్లు తనకు అండగా నిలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనే దాన్ని వేచిచూడాల్సిందే.