నీట్‌ 2024 కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

నీట్‌ 2024 కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు– 25 లక్షలకు పైగానే అప్లికేషన్లు
– గతేడాదితో పోలిస్తే 4.2 లక్షలు అధికం
– గడువు తేదీ ఈనెల 16 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ : దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి యేటా నిర్వహించే నీట్‌ పరీక్షకు దరఖాస్తులు ఈసారి వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 25 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చి చేరాయి. ఇది గతేడాదితో పోలిస్తే 4.2 లక్షలు అధికం కావటం గమనార్హం. నీట్‌ యూజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును మార్చ్‌ 16 వరకూ పొడిగిస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇప్పటి వరకు నీట్‌ 2024కు దరఖాస్తు చేయలేనివారికి మరో అద్భుత అవకాశం లభించినట్టయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం గడువు ఈనెల 9తోనే ముగియాల్సి ఉన్నది. అయితే, దేశవ్యాప్తంగా వచ్చిన అభ్యర్థనల మేరకు మరో వారం దరఖాస్తులకు గడువును పొడిగించారు.ఎన్‌టీఏ ప్రతియేటా నీట్‌ పరీక్ష నిర్వహిస్తుంది. నీట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నీట్‌ యూజీ 2024 పరీక్ష జరగనున్నది. ఈ పరీక్షపై ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నీట్‌ పరీక్ష మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. నీట్‌ పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగే పరీక్ష. మే 5 వతేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్‌ 14న వెల్లడిస్తారు. అభ్యర్ధుల వయస్సు 17 ఏండ్లు మించి ఉండాలి. గరిష్టంగా ఎంతైనా ఉండవచ్చు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోలజీ, బయో టెక్నాలజీ సైన్స్‌లో ఇంటర్‌ లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.