– తీర్పుపై స్టేకి అత్యున్నత న్యాయస్థానం నిరాకరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన ముంబాయి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర సర్కార్‌కు చుక్కెదురైంది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. త్వరగా ఈ కేసులో వాదనలు చేపట్టాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. సరైన సమయంలోనే ఈ కేసులో విచారణ ఉంటుందన్నారు. నిర్దోషిగా ప్రకటించిన తీర్పును అత్యవసరంగా మార్చాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసంగానే ఉందని, ప్రాథమికంగా నిర్ధారణ అవుతోందని వెల్లడించింది.
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: సీతారాం ఏచూరి
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై ఆయన స్పందించారు. ”హైకోర్టు చాలా సహేతుకమైన తీర్పునిచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని స్వీకరించలేము” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.