ఐద్వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ


నవతెలంగాణ కంఠేశ్వర్: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా జెండాను  మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిత, సుజాతలు  మాట్లాడుతూ..1980లో మోటూరి ఉదయం ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సంఘంగా ఏర్పడి 1981 ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఒకటే పేరు ఉండాలని ఉద్దేశించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏర్పడి మహిళలకు రక్షణగా, మహిళ హక్కుల సాధనకై, నిరంతరం మహిళలపై జరుగుతున్న దాడులకు, హింసకు హత్యలకు, లైంగికదాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళలకు రక్షణగా మేమున్నామంటూ నిలుస్తున్నదని తెలిపారు. ఇందుకు ఉదాహరణ బిల్కిస్ బాను కేసులో నిందితులకు ప్రధాని బెయిల్ ఇప్పించి సన్మానాలు చేసినా కూడా విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మళ్లీ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు కూడా పునరాలోచించేలా చేసింది ఐద్వా అని తెలిపారు. ఐద్వా ఆలిండియా నాయకురాలు సుభాషిని ఆలీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దోషులను మళ్లి జైలుకు పంపే వరకు పోరాడిన చరిత్ర ఐద్వాకు ఉంది. అలాగే ఢిల్లీలో జరిగిన ఘటనపై హత్రాస్ లో జరిగిన ఘటనపై కానీ ఇలా దేశ నలుమూలల ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగిన ఐద్వా వారికి అండగా ఉంటుందని అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు శ్రీదేవి, సంతోషి, శ్రావ్య, స్వప్న, విమల భాయ్, శారదా, కళ, రేఖ తదితరులు పాల్గొన్నారు.