ప్రమాదంలో రాజ్యాంగం

Constitution at stakeపార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఓట్ల కోసం బీజేపీ నాయకులు తమ మతోన్మాద ఆటను తీవ్రతరం చేస్తున్నారు. హిందూ ఓటర్లను దగ్గర చేసుకునేందుకు వారి భాష మార్చారు. ‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని హిందువులకు అనుకూలంగా మార్చేస్తాం’ అంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే సంచలన వ్యాఖ్యలే దీనికి తాజా ఉదాహరణ. గతంలో ఈయనగారే ఒకానొక సందర్భంలో ‘రాజ్యాంగ పీఠిక నుంచి ‘లౌకిక’ అనే పదాన్ని తొలగిస్తాం’ అని కూడా అన్నాడు. అంటే దేశంలోని అణగారిన మతాలు, కులాలు, ప్రజలకు భద్రతను, సమాన హక్కులను ప్రసాదిస్తున్న భారత రాజ్యాంగమంటే బీజేపీకి ఎంతటి కసి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని తిరగ రాయాలనేది బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు దశాబ్దాల నాటి కల. గోల్వాల్కర్‌ అసలు రాజ్యాంగం అమల్లోకి రావడాన్నే ఆనాడు జీర్ణించుకోలేక పోయాడు. అందుకే రాజ్యాంగాన్ని తిరగ రాయాల్సిందే అంటూ ఆయన శిష్య బృందం అవకాశం చిక్కినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంది. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాల్లో భాగమే భారత రాజ్యాంగ మార్పు. ఆ కలను నిజం చేసుకునేందుకు నేడు అధికారంలో ఉన్న బీజేపీ తన రోడ్‌ మ్యాప్‌ రూపొందించుకుంటోంది. ఇటు స్వామికార్యం, అటు స్వకార్యం పూర్తవుతుందని మోడీ ఆరాటం. అందుకే ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశంలో ఉండాలంటే హిందువులుగానైనా మారాలి, లేదంటే ద్వితియ శ్రేణి పౌరులుగా ఉండిపోవాలని బీజేపీ నాయకులతో అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేయిస్తున్నాడు.
ఎన్నికలప్పుడు ఓట్లు రాల్చుకోడానికి మోడీకి ఒక ఆయుధం కావాలి. 2014లో గుజరాత్‌ నమోనాను చూపించి అభివృద్ధికి తానే ప్రత్యామ్నాయం అన్నాడు. అలాగే రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానంటూ తన మాటల గారడీతో అధికారం చేజిక్కించు కున్నాడు. కానీ ఏడాదిలోనే గుజరాత్‌ అభివృద్ధి ఏంటో బట్టబయలైంది. రెండు కోట్లు కాదు కదా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడి పోయి దేశ ప్రజలు నిత్యావసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారనేది నేటి పచ్చినిజం. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారిపోతుందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇక తమ ఆదాయం రెట్టింపు అవుతుందనుకున్న రైతులు నేటికీ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అంటే వారి ఆదాయం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక 2019లో పూల్వామా ఘటన అడ్డుపెట్టుకొని సర్జికల్‌ స్ట్రైక్‌ చేశానంటూ గొప్పలు చెప్పుకుంటూ అందలమెక్కాడు. దీనిబట్టి మోడీకి తన కుర్చీ కాపాడుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టవనేది మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది.
ఇక ఓట్లడిగేందుకు ఆయన వద్ద ఉన్న అన్ని అస్త్రాలు అరిగిపోయాయి. ఏ దిక్కూ లేనోడికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు 2024 ఎన్నికల కోసం రామ జన్మభూమి, కాశీ విశ్వనాథుని చుట్టూ తిరుగుతున్నాడు. దేశ ప్రధాని ఓ మత ప్రచారకుడిగా మారి ఇంటింటికి అక్షింతలు పంపించారు. మైనార్టీలను పక్కన పెట్టి 80శాతానికి పైగా ఉన్న హిందువులను తనవైపుకు తిప్పుకుంటే ఈసారి తన పబ్బం గడిచిపోతుందని మోడీకి, గోడీ మీడియాకు బాగా తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలుసు. అందుకే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా, ఎంత మంది నిరసనలు తెలిపినా నిన్నటికి నిన్న సీఏఏను మొండిగా అమలు చేయడం కూడా ఇందులో భాగమే. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అలాగే ఏనాటికైనా తనకు అక్కరకొస్తుందనే మొదటి నుండి ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను అంటూ ఇలా అన్నింటా ఒకే.. ఒకే అనే పాట మొదలుపెట్టాడు. ఇప్పుడు రాజ్యాంగాన్నే హిందువులకు అనుకూలంగా మార్చేస్తానంటూ తన మనసులోని మాట బయట పెట్టించాడు. భిన్నత్వంలో ఏకత్వంగా విలసిల్లుతున్న మన విశాలమైన భారతావనిని ఒక మతదేశంగా మార్చడం సరైనదా? ఇప్పుడు ప్రతి పౌరుడూ వేసుకోవాల్సిన ప్రశ్నిది. మోడీ అనుకున్నట్టు ఆయన అధికారం పదిలంగా ఉండాలంటే భారతదేశం హిందూ దేశంగా అవతరించడం అత్యవసరం. దీనికి అడ్డుగా ఉన్నది రాజ్యాంగం. అందుకే బీజేపీ నాయకులు సందు దొరికినప్పుడల్లా రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు.
రాజ్యాంగం అంటే నూట ముప్ఫై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు రూపొందించుకున్న హక్కు పత్రం. భిన్న జాతులు, మతాలు, కులాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, ఆహారాపు అలవాట్లు కలగలిపిన మహోన్నత దేశం మనది.
కనుకనే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నాం. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. హిందువు లను తన ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు మోడీ పన్నుతున్న ఈ పన్నాగాలతో దేశం ప్రమాదంలో పడటం ఖాయం. వీటన్నింటినీ అర్థం చేసుకుని ప్రజలు అప్రమత్తగా ఉండాల్సిన సమయమిది.