నవతెలంగాణ-పరిగి
యాదాద్రి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి జరిగిన కుల వివక్ష పై పూర్తిస్తాయి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖల పట్ల ఆలయ నిర్వాహకులు కులవివక్ష ప్రదర్శించారన్నారు. ముఖ్యమంత్రితో పాటు సందర్శించిన మంత్రుల్లో వీరిద్దరిని మాత్రమే వేరుగా చూశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దంపతులకు, అగ్రవర్ణాలకు చెందిన ఇతర మంత్రులకు కుర్చీలు వేసి, వీరిద్దరిని మాత్రం చిన్న పీటలమీద కూర్చోబెట్టి కులవివక్ష ప్రదర్శించారన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో వివక్ష ప్రదర్శించడం మరింత ఆందోళనకరం అన్నారు. ఇతర మంత్రులు కూడా కనీసం ప్రొటోకాల్ పాటించలేదన్నారు.ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కూర్చున్న తర్వాత మిగిలిన స్థానాల్లో వారు కూర్చుని ఉంటే హుందాగా ఉండేదన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, కులవివక్షకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుందని తెలిపారు.