– రాణించిన శ్రేయస్, రహానె
– ముంబయి రెండో ఇన్నింగ్స్ 48/10
– విదర్భ లక్ష్యం 538, ప్రస్తుతం 10/0
ముంబయి రంజీ ట్రోఫీలో 42వ టైటిల్ లాంఛనం చేసుకుంది!. యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ (136) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అజింక్య రహానె (73), శ్రేయస్ అయ్యర్ (95) అర్థ సెంచరీలు బాదారు. రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగుల భారీ స్కోరు సాధించిన ముంబయి.. విదర్భకు 538 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. అద్భుతం ఏదైనా జరిగితే తప్ప ముంబయి 42వ సారి రంజీ విజేతగా నిలువటం ఖాయమే!.
నవతెలంగాణ-ముంబయి :యువ ఆటగాడు, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ (136, 326 బంతుల్లో 10 ఫోర్లు) రంజీ ట్రోఫీ ఫైనల్లో సూపర్ సెంచరీ నమోదు చేశాడు. సీనియర్ ఆటగాళ్లు విఫలమైన తరుణంలో వరుస ఇన్నింగ్స్‌ల్లో నిలకడగా పరుగులు సాధించిన ముషీర్ ఖాన్.. టైటిల్ పోరులోనూ తడఖా చూపించాడు. విదర్భ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 326 బంతుల్లో 10 బౌండరీలతో బాధ్యతాయుత శతకం సాధించాడు. కెప్టెన్ అజింక్య రహానె (73, 143 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) వరుస వైఫల్యాల నుంచి బయటపడ్డాడు. అర్థ సెంచరీతో రాణించాడు. ముషీర్ ఖాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించిన రహానె ముంబయిని భారీ స్కోరు దిశగా నడిపించాడు. రహానె నిష్క్రమించినా.. మరో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (95, 111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ముషీర్ ఖాన్ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. అయ్యర్, ముషీర్ జోడీ నాల్గో వికెట్‌కు 168 పరుగులు జత చేసింది. ఈ జోడీ మెరుపులతో ముంబయి దాదాపుగా మ్యాచ్‌ను విదర్భ నుంచి లాగేసుకుంది. సెంచరీ ముంగిట అయ్యర్ నిష్క్రమించినా.. టెయిలెండర్లు విలువైన జరుగులు చేశారు. శామ్స్ ములాని (50, 85 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీతో ధనాధన్ మోత మోగించాడు. 130.2 ఓవర్లలో 418 పరుగులకు ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. విదర్భకు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో విదర్భ 10/0తో పోరాడుతుంది. ఓపెనర్లు అతర్వ (3), ధ్రువ్ (7) అజేయంగా ఆడుతున్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా విదర్భ విజయానికి 528 పరుగులు పరుగులు అవసరం కాగా.. ముంబయికి 10 వికెట్లు అవసరం. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె (5/144), యశ్ ఠాకూర్ (3/79) రాణించారు.
మెరిసిన మాస్లర్ బ్లాస్టర్ :
ముంబయి, విదర్భ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు మాస్టర్ బాస్లర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టైటిల్ పోరు మూడో రోజు ఆటకు చూసేందుకు సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియానికి వచ్చారు. మాజీ క్రికెటర్లు, ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లతో కలిసి ఆటను వీక్షించారు. ‘ఫైనల్లో ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో ఎంతో క్రమశిక్షణ, సహనం, పట్టుదలతో కూడిన ఆటతీరు కనబరిచింది. రహానె, ముషీర్ భాగస్వామ్యం ముంబయిని ముందజంలో నిలుపగా.. శ్రేయస్, ముషీర్ భాగస్వామ్యం మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేసుకుంది. ముంబయి క్రికెట్ సంఘం స్నేహితులు, సహచర క్రికెటర్లతో కలిసి మ్యాచ్‌ను వీక్షించటం బాగుంది’ అని సచిన్ టెండూల్కర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ముంబయి తొలి ఇన్నింగ్స్ : 224/10
విదర్భ తొలి ఇన్నింగ్స్ : 105/10
ముంబయి రెండో ఇన్నింగ్స్ : 418/10
విదర్భ రెండో ఇన్నింగ్స్ : 10/0