– ఎండుతున్న పండ్ల తోటలు
– అలుముకున్న కరువు చాయలు
– పండ్లతోటల రైతులకు మిగిలింది అప్పులే
– దిగుబడిపై తీవ్ర ప్రభావం
– నీళ్లు లేక ఎండిన పంటలు
– ఎజెన్సీ ప్రాంతంలో మరీ దారుణం
– ఎండిపోయిన వరి, మిర్చి, వేరుశనగ
భూగర్భ జలాలు పడిపోతున్న కొద్దీ సాధారణ పంటలే కాదు పండ్ల తోటలకు సాగునీటి సమస్య తప్పదు. కాల్వలు ఆగిపోవడంతో ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన వరి, మిర్చి, వేరుశనగ పూర్తిగా ఎండుదశకు చేరుకొంది. ఆహార, వాణిజ్య పంటలే కాదు పండ్లతోటలు సైతం నీటి సమస్యను ఎదురుకుంటున్నాయి. ముఖ్యంగా మామిడి, బత్తాయి తోటలు పూత కాత దశలో సరైన సమయంలో నీళ్లు వదల కుంటే… దిగుబడి పడిపోతుందని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ పండ్లతోటలను సాగుచేసేది కౌలు రైతులే. ఈ ఏడాది వాతా వరణంలో వచ్చిన మార్పులు, ఇప్పుడున్న పరిస్థితులు పరిశీలిస్తే… కరువు ఛాయలు అలుము కునే అవకా శా లున్నాయి. భూగర్భ జలాలు పడి పోవడంతో రైతులు నష్టాల బారిన పడు తన్నారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 74 మండలాలకుగాను 30 మండలాల్లో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. ప్రతి ఏటా సుమారు రభీలో 7 లక్షల ఎకరాలను సాగు చేసేవారు. ఈసారి రిజర్వాయర్లు బోరు బావుల కింద కలిసి మొత్తం రెండు లక్షల ఎకరాలకు మించి సాగు కాలేదు. కల్వకుర్తి , నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టుల కింద 20శాతానికి మించి సాగు కాలేదు. జూరాల చివరి ఆయకట్టు అయిన పెంట్లవెల్లి, చిన్నంబావి వంటి మండలాల పరిధిలో లక్ష ఎకరాల వరి ఎండిపోయింది. మరో 20 వేల ఎకరాలలో మొక్క, మిర్చి, పెసర వంటి పంటలు చేతికి రాకుండా పోయాయి. పండ్ల తోటల సాగులోనూ.. రైతులు కష్టాలను ఎదురు కుంటున్నారు. 6నుండి 9 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉంటేనే పండ్లతోటలకు నీరు అందుతోంది. ఈసారి 15 మీటర్ల లోతుకు భూగర్భ జలాల పడిపోయాయి. భూగర్భ జలాల పడిపోవడంతో మామిడి,బత్తాయి,జామ, నిమ్మ, అరటి తోటలకు నీటి సమస్య ఏర్పడింది. కాల్వలు రిజర్వాయర్లు ఉంటే.. వీటికి నీటి సమస్య ఉండదు. పైన పారించడానికి నీరు లేదు భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీంతో మామిడి, జామ వంటి తోటలు ఎండుదశకు చెరుకున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 76వేల ఎకరాల మామిడి తోటల ఉన్నాయి. మరో 30 వేల ఎకరాలు ఇతర పంటలు సాగులో ఉన్నాయి. ఒక కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనే 26 వేల ఎకరాల మామిడితోటలు ఉన్నాయి. వనపర్తిలో 16 వేలు, నారాయణపేటలో 16 వేలు, నాగర్‌కర్నూల్‌లో 34 వేల ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. మరో 15 వేల ఎకరాలు గద్వాల జిల్లాలో మామిడితోటలు ఉన్నాయి. ఇటు ఆహార పంటలు ఆశించిన స్థాయిలో సాగులో లేక అటు పండ్లతోటలకు భూగర్భ జలాలు పడిపోవడంతో జిల్లాలో కరువు చాయలు అలుముకున్నాయి.
కమ్ముకుంటున్న కరువు ఛాయలు
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా గత ఖరీఫ్‌లోనూ… ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మూడు నెలల పాటు వర్షాలు రావాల్సి ఉండగా కేవలం 45 రోజులకే వర్షాలు ఆగిపోయాయి. శ్రీశైలంకు సగం నీరు కూడా రాలేదు. జూరాలది అదే పరస్థితి నెలకొంది. ఎప్రిల్ వరకు కల్వకుర్తి ఎత్తిపోతల నుండి కాల్వలు రావల్సి ఉంది. ఈసారి డిసెంబరు చివరి నాటికే కాల్వలు ఆగిపోయాయి.ఇటు వరి, మిర్చి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆహార పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరువు ఛాయల నుండి ప్రభుత్వం ఆదుకోవాలని పలు పార్టీలు, రైతు సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా మామిడి సాగులో ఉన్న కౌలు రైతులకు నష్టాలు రాకుండా కాపాడాలని కోరుతున్నారు.
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆహార పంటలే కాదు పండ్లతోటలు సైతం నీరు లేక ఎండి పోతున్నాయి. తక్షణం తెలంగాణ ప్రభుత్వం వెంటనే సాగులో ఉన్న పండ్ల తోటలు, వరి, వేరుశనగ, మిర్చి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– వర్థం పర్వతాలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి,నాగర్‌కర్నూల్
రైతులు ఆరుదడులపై దృష్టి పెట్టాలి
జిల్లాలో ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి. వరి పంటలను లక్ష ఎకరాల వరకు సాగు చేశారు. ఇందులో 10 వేల ఎకరాలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే వరిని సైతం ఆరుతడి మీద తడుపుతున్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేనిచో జిల్లాలో కరువు పరిస్థితలు వస్తాయి.
– వెంకటేశ్వర్లు, డిఎఓ, మహబూబ్‌నగర్ జిల్లా