జీపీ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

నవతెలంగాణ : వనపర్తి
పెండింగ్‌ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి అందజేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డిపిఓ రమణ మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి గత నాలుగు ఐదు నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, గ్రామ పంచాయతీ సిబ్బందినీ పర్మినెంట్‌ చేసే వేతనాలు చెల్లించాలని కోరారు. కారోబార్‌ బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శులు నియమించాలన్నారు. మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానం రద్దు చేయాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ప్రమాద బీమా, ఇన్సూరెన్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్స్‌, డంపింగ్‌ యార్డ్స్‌, హరితహారం, పల్లె ప్రకతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంటు వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఉద్యోగులకు నెలలో మొదటి రోజు వేతనాలు చెల్లిస్తుందని గొప్పలు చెప్పుకుం టుందన్నారు.కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఐదు నెలలు గడుస్తున్న వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వేతనాలు చెల్లించకపోతే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టిన గతే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సూర్య వంశం రాము, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ అనుబంధం జిల్లా అధ్యక్షులు హనుమంత్‌, జిల్లా కోశాధికారి పుష్ప, జిల్లా నాయకులు హనీప్‌, శ్రీను, దాసు, ఎల్లయ్య, సుగ్రీవుడు, రాము, శివ, అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.