– ధర్నాకు అనుమతిచ్చి అడ్డుకోవడం సరికాదు
– వీఓఏల ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మాడుగులపల్లి
వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వీవోఏల కనీస వేతనం కోసం గత 43 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం సీఐటీయూ పిలుపు మేరకు హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయి సమావేశానికి మిర్యాలగూడ డివిజన్‌కు సంబంధించిన మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లోని వీఓఏలు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో మాడుగులపల్లి మండల కేంద్రంలో గల టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డగించి దాదాపు అరవై మందిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి హుటా హుటిన టోల్గేట్ వద్దకు చేరుకుని వీవోఏలతోపాటు ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. వీఓఏలు సోమవారం రాష్ట్ర స్థాయి సమావేశం కోసం ఈనెల 27న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు పోలీసు పై అధికారుల వద్ద పర్మిషన్ తీసుకున్నప్పటికీ అనుమతి ఇచ్చి కూడా మరి వారే ఆపి అడ్డుకోవడం అనేది సరైన పద్ధతి కాదన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారు పోయే రాష్ట్రస్థాయి విస్తృ సమావేశానికి కచ్చితంగా పంపించాలని చెప్పి పోలీసు పై అధికారితో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి చరవాణిలో మాట్లాడారు. వారు చేసే ఈ న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి వారి డిమాండ్లను న్యాయమైనవిగా భావించి వారికి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీవోఏలందరినీ వాహనాలు ఎక్కించి హైదరాబాద్ తరలించే ప్రయత్నంగా వాహనాలు కదిలే వరకు అక్కడే ఉండి వెళ్లారు. ఈ ధర్నాతో టోల్ ప్లాజాకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, మల్లు గౌతమ్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీవోఏల జిల్లా అధ్యక్షురాలు కప్పల లక్ష్మి, కార్యదర్శి కంటు ఇంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
వీఓఏల సమ్మెలో వడదెబ్బకు గురైన తరి బిక్షం
పెద్దవూర : సమస్యలు పరిష్కరించాలని వీఓఏలు చేస్తున్న సమ్మె 44 రోజులకు చేరింది. సోమవారం సమ్మెలో పాల్గొన్న మండల గౌరవ అధ్యక్షులు తరిబిక్షం ఎండకు వేడిగాలులకి తట్టుకోలేక వడదెబ్బకు గురయ్యారు. వెంటనే నాగార్జున సాగర్ కమలా నెహ్రు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షులు చిలుముల దుర్గయ్య ఆయన్ను పరామర్శించి మాట్లాడారు. ప్రభుత్వం తమ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దఫలవారీగా ఆర్డీవో, కలెక్టరేట్లను ముట్టడి చేసిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయం, ప్రగతి భవన్ ముట్టడికి కూడా వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాయని లక్ష్మి, కోశాధికారి పాతనబోయిన పద్మ, రాజేశ్వరి, సరోజ, పద్మ, శాంతి, సుజాత సత్యనారాయణ బికోజి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.