ఇది ట్రైలర్‌ మాత్రమే…ఇంకా చాలాదూరం వెళ్ళాలి

ఇది ట్రైలర్‌ మాత్రమే...ఇంకా చాలాదూరం వెళ్ళాలి– రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపనలో ప్రధాని మోడీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘ఈ పదేండ్ల పాలన ట్రైలర్‌ మాత్రమే. నేను ఇంకా చాలా దూరం వెళ్లాలి’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంగళవారంనాడాయన రూ.1 లక్షా 6వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంఖుస్థాపన, జాతికి అంకితం చేసే పనులను అహ్మదాబాద్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ – విశాఖపట్నం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపారు. కేంద్ర రైల్వే కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్వినీవైష్ణవ్‌ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కూడా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన వర్చువల్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌ కుమార్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శ్రీలంక, మొజాంబిక్‌, సెనెగల్‌, మయన్మార్‌, సూడాన్‌ వంటి దేశాలకు మేడ్‌ ఇన్‌ ఇండియా లోకోమోటివ్‌లు, కోచ్‌లు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. మేడ్‌ ఇన్‌ ఇండియా సెమీ హైస్పీడ్‌ రైళ్లకు డిమాండ్‌ పెరగడం వల్ల ఇలాంటి కర్మాగారాలు ఆవిర్భవిస్తూ, రైల్వేల పునరుద్ధరణ, కొత్త పెట్టుబడులు, కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు. పదేండ్ల క్రితం కంటే రైల్వేల అభివృద్ధి మరింత వేగవంతం అయ్యిందనీ, ప్రతిపక్షాలు దీన్ని సహించలేకపోతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌లో కలిపేయడం వల్ల రైల్వేల అభివృద్ధికి ఎక్కువ వనరులు అందించడం సాధ్యమైందని తెలిపారు. రైల్వే కారిడార్లను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందనీ, ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.