పవర్‌లూమ్‌ కార్మికుడి ఆత్మహత్య

పవర్‌లూమ్‌ కార్మికుడి ఆత్మహత్యనవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌
ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్‌ లూమ్‌ కార్మికుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం లోని బీవైనగర్‌కు చెందిన తడక శ్రీనివాస్‌ పవర్‌లూమ్‌ కార్మికుడుగా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, ఇద్దరు కూతుర్లు ఉండగా, కుటుంబ కలహాలతో ఏడేండ్లుగా భార్య పిల్లలతో వేరుగా ఉంటోంది. ఇటు కుటుంబ సమస్యలు.. మరోవైపు మూడు నెలలుగా ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో శ్రీనివాస్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : మూషం రమేష్‌, పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు
ఆత్మహత్య చేసుకున్న పవర్‌లూమ్‌ కార్మికుడు తడక శ్రీనివాస్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అంబేద్కర్‌ చౌక్‌ వద్ద వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి వస్త్ర పరిశ్రమ బంద్‌తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పలుమార్లు ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పించి సిరిసిల్లలో మూతబడిన పరిశ్రమలను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 14న సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి విమల, గురజాల శ్రీధర్‌, అన్నల్దాస్‌ గణేష్‌, వార్పిన్‌ యూనియన్‌ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, గౌరవ అధ్యక్షుడు ఉడుత రవి, పవర్‌లూమ్‌ నాయకులు నక్క దేవదాస్‌, గుండు రమేశ్‌, సబ్బని చంద్రకాంత్‌, బెజుగం సురేష్‌, మోర తిరుపతి, వైపని నాయకులు ఎలిగేటి శ్రీనివాస్‌, అసాముల సంఘం నాయకులు సిరిసిల్ల రవి, చేరాల అశోక్‌ పాల్గొన్నారు.