
– రూ.18 కోట్ల 50 లక్షల పనులకు శంకుస్థాపన
– తాగు నీటి కోసమే రూ.3.5 కోట్లు మంజూరు
– 25 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీటిని అందించినప్పుడే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా నాకు సంతోషమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ ఎంపిడిఓ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరితో కలిసి రూ .18 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు, మురుగుకల్వల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పూర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందే రాజకీయాలనీ, ఎన్నికల తరువాత రాజకీయాలు లేవని అంతా కలిసి ఉంటారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే పొన్నం ప్రభాకర్ అని మీ ఎమ్మెల్యేగా గౌరవాన్ని తీసుకొస్తానని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనం తో ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యానని ఇప్పటికీ మర్చిపోనన్నారు. హుస్నాబాద్ లో ఎమ్మెల్యేగా గెలవగనే తాగు నీటికి ప్రాధాన్యత కల్పిస్తూ రెండు నెలల ముందే అధికారులతో సమీక్షించి హుస్నాబాద్ కు తాగు నీటి కోసమే 3.5 కోట్లు మంజూరు చేశానని అన్నారు.మున్సిపాలిటీ లో ఎలాంటి సమ్యాస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నా శాఖ పరిధిలో ఆర్టీసి లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 25 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో దేవాలయాలలో భక్తుల తాకిడి పెరిగిందన్నారు.నిన్న ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించామని మరో వెయ్యి బస్సులు వస్తున్నాయన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ నీ 250 పడకల హాస్పిటల్ చేయాలని ప్రాసెస్ నడుస్తుందన్నారు. ప్రియాంక గాంధీ హామీ మేరకు హుస్నాబాద్ కి త్వరలోనే మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. హుస్నాబాద్ ప్రజలకు ఉచిత వైద్యం అందించడం కోసం హైదరాబాదు హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఒకరిని నియమించినట్లు తెలిపారు.హుస్నాబాద్ లో విద్యా , వైద్యా, రవాణా ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
కళాశాలలను సందర్శించిన మంత్రి: ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని సమస్యలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తమకు కాంపౌండ్ వాల్ తో పాటు ,వాటర్ ఫెసిలిటీ ,స్ట్రీట్ లైట్స్ సమస్యలు ఉన్నాయని మంత్రి గ దృష్టికి తీసుకెల్లారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని పరిశీలించారు . కాలేజీ భవనం పూర్తయినప్పటికీ కాలేజీ ఎందుకు అందులోకి షిఫ్ట్ చేయలేదని మంత్రి ప్రిన్సిపల్ ను ప్రశ్నించారు. రేపే కాలేజీని డిగ్రీ కాలేజీ నూతన భవనం లోకి షిఫ్ట్ చేయాలని అధికారులకు,ప్రిన్సిపల్ కి ఆదేశాలు.
ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు: హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సిద్దిపేట జెడ్పి వైస్ చైర్మన్ రాజిరెడ్డి,ఆర్డీఓ బెన్ షాలేం, ఎంపిపి లకావత్ మానస, స్థానిక కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు.