దేశానికి ప్రత్యామ్నాయ విద్య ఎందుకు?

దేశానికి ప్రత్యామ్నాయ విద్య ఎందుకు?నూతన జాతీయ విద్యా విధానం భారతదేశ భవిష్యత్‌ నిర్మాణానికి తొలి అడుగు అని ప్రధాని మోడీ అంటున్నారు. ఇప్పటివరకు ‘ఏం ఆలోచిం చాలి?’ అనే విషయంపైననే దృష్టి పెట్టారని, తాజా ఎన్‌ఈపీ ‘ఎలా ఆలోచించాలి? అనే విషయానికి ప్రాదాన్యత ఇస్తుందని మోడీ ఎన్‌ఈపీ గురించి గొప్పగా చెపుతున్నారు. ఇంత గొప్ప విద్యా విధానంపై పార్లమెంటులో ఎందుకు చర్చించలేదనేది ప్రశ్నకు సమాధానం లేదు? అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఎన్‌ఈపిని అసలు అమలు చేయమని బహిరంగంగానే ప్రకటించాయి. తమిళనాడు ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. బీజేపీయేతర రాష్ట్రాలు కర్నాటక, కేరళ, బెంగాల్‌ ఎన్‌ఈపినీ వ్యతిరేకిస్తున్నాయి. వీటికి గల కారణాలు తెలిస్తే ఎన్‌ఈపి వెనుకున్న అసలు ఎజెండా మనకు అర్థమవుతుంది..
ఈ విద్యా విధానం ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగాన్‌ కమిటీ సిపార్స్‌ చేసింది.2020 జూలై 29 నుండి ఈ విద్య విధానం అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మండలి ప్రకటించింది. అప్పటి నుంచి కేంద్ర విద్యశాఖ నుండి ఎన్‌ఈపి నీ అమలు చేయాలని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తోంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణతో విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. అయితే ఈ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా అమలు చేయాలని రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఈ విధానంలో ప్రధానమంత్రి నేతృత్వంలో గల రాష్ట్రీయ శిక్ష అయోగ్‌ (అర్‌ఎస్‌ఎ) కింద స్థానిక యూనిట్స్‌గా రాష్ట్రాలు పని చేయాల్సి ఉంటుంది.దీంతో రాష్ట్రాలకు తమ అనుకూలంగా నిర్ణయించుకునే వెసులుబాటు, స్వతంత్రత ఉండదు. వైవిద్య భరితమైన దేశంలో సిలబస్‌ నిర్వహణలో, పరీక్షల తయారీలో వివిధ సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబించేటట్లు విద్య ఉండాలి. కానీ అది ఇందులో కొరవడుతోంది.ఈ విద్యా విధానం అమలు చేయని రాష్ట్రాలకు నిధుల కోత పెడుతామంటోంది. స్వయం ప్రతిపత్తి కలిగిన యూజీసీ లాంటి సంస్థలు రేపు ఉండవు గనుక బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల చూపే ప్రేమ ఇతర రాష్ట్రాలపై ఉండదనేది సుస్పష్టం. రాజ్యాంగం ప్రీయంబుల్‌లో పేర్కొన్న లౌకిక, సామ్యవాద అంశాలకు ఈ విద్యావిధానంలో ఎక్కడ తావులేదు. దీన్ని బట్టి ఈ విద్యావిధానం రాజ్యాంగ స్ఫూర్తి తేటతెల్లమవుతుంది.
సామాజిక న్యాయానికి చోటేది?
మొత్తం ఎన్‌ఇపిలో సామాజిక న్యాయాన్ని గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు.సమాజంలో అట్టడుగున ఉన్నవారు చదువు నేర్చుకుని, నైపుణ్యాన్ని సాధించి ఆర్థికంగా, సామాజికంగా పైస్థాయికి చేరుకోడానికి కుల వ్యవస్థలోని ఆధిపత్య స్వభావం, పితృస్వామ్య భావజాలంలోని ఆంక్షలు కారణాలుగా ఉన్నాయి. ఇవి ఏవిధంగా ఆటంకంగా వ్యవహరించాయో ఎన్‌ఇపి వీటిని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు.. ఈ వివక్షతను, అణచివేతను నిర్మూలించాలన్న అంశం కానీ రిజర్వేషన్ల విధానం గురించి ఎక్కడ పేర్కొనలేదు. సమాజంలో శతాబ్దాల తరబడి వివక్షతను ఎదుర్కొంటూ అవకాశాలకు దూరంగా నెట్టి వేయబడిన వర్గాలు, మహిళలు, మైనార్టీలు గిరిజన తెగల విద్యార్థులు ఇతరులతో సమాన స్థాయికి ఎదగాలంటే వీరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వలన సాధ్యమవుతుందనేది వాస్తవం.ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు.ఇంత కీలకమైన అంశాన్ని ఎన్‌ఈపి పట్టించుకోలేదంటేనే ఆ వర్గాల పట్ల ప్రభుత్వ నైజాన్ని అర్థం చేసుకోవచ్చు.ఈ విద్యావిధానం అమలుతో సామజిక వెనకబాటు గురైన వర్గాల విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమే?
కులవృత్తులకే పరిమితమా?
వృత్తి విద్యా పేరుతో కుల వృత్తులను పాఠశాల విద్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కులవృత్తుల్ని ప్రోత్సహించడం అంటే తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడమే అవుతుంది. అరోవతరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు అమలు చేయనున్నారు.శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత వంటి ధోరణులను పెంపొందించే బదులు తక్కువ వేతనాలకే పనిచేసే కార్మికులను తయారు చేయడానికి రేపు ఒకేషనల్‌ కోర్సుల పేర వృత్తి విద్యలను నేర్పుతారు. మన దేశంలో పేదరికం, సామజిక వివక్షత వలన విద్యను కింది వర్గాలు దూరమయ్యారు.
ఇప్పుడిప్పుడే ఉన్నతవిద్య వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఉన్నత విద్యా చదువుతున్నా వారు కేవలం 36శాతం మాత్రమే.స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో వృత్తి విద్యా అమలు చేస్తే ఉన్నత విద్యను చదివే వారి సంఖ్య మరింత తగ్గనున్నది. కులవృత్తులు నేర్పి సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతుంది.వృత్తి నేర్చుకొన్న విద్యార్థులు ఉపాధి కోసం మార్కెట్‌బాట పడతరనేది వాస్తవం. బాల కార్మికుల చట్టాలు అమలులో ఉన్నా కూడా బాలలు కార్మికులుగా మగ్గుతున్నారు.రేపు ఇది అమలైతే వారి బంగారు భవిష్యత్తు మరింత బుగ్గిపాలు కానున్నది.
పరిశోధనకు సంకెళ్లు
ఈ నూతన జాతీయ విద్యా విధానంలో (ఎన్‌.అర్‌.ఎఫ్‌) నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పేరుతో పరిశోధనలను నియంత్రించనున్నది. పరిశోధనలు చేయాలంటే ఎన్‌.అర్‌.ఎఫ్‌ సూచనలకు అనుగుణంగా చేయాల్సిందే. వాటికి మాత్రమే గుర్తింపు ఇస్తుంది ఫెలోషిప్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఎన్‌అర్‌ఎఫ్‌ కూడా (రాష్ట్రీయ శిక్ష అయోగ్‌ )అర్‌ఏస్‌ఏకు జాతీయ సంస్ధగా పనిచేస్తుంది. ఇది సామాజిక పరిశోధనల కన్నా వాణిజ్యపరమైన పరిశోధనకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఇప్పటికే దేశంలో పరిశోధన విద్య ప్రోత్సాహకాన్ని తగ్గించింది. దీని వలన మన రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పాటు ఎన్‌ఈపిలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిల్‌ కోర్స్‌ రద్దు చేశారు.శాస్త్రీయ దృక్పథం లేని కోర్సులులో పరిశోధనకు పెద్దపీట వేయనున్నారు.ఇప్పటికే యోగా, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, కర్మశాస్త్రం, భూత వైద్యశాస్త్రాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
ఈ విద్యా విధానం మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యత గురించి తెలపలేదు. అంతేకాక అదనంగా ఒక ప్రాచీన భాషను అంటే సంస్కృతంను ఉన్నత విద్య దశతో సహా అన్ని స్థాయిలలోనూ నేర్చుకోవాలని నిర్దేశించింది. సంస్కృతానికి పెద్దపీట వేసి ఇతర ప్రాచీన భాషలైన తమిళం, పాళీ, పర్షియన్‌ భాషలను చిన్న చూపు చూసింది. ఇతర దేశాల భాషలను సైతం నేర్చుకోవాలని చెప్పి ఫ్రెంచి, జపనీస్‌, కొరియన్‌, వంటి భాషలను ప్రస్తావించిన ఎన్‌ఇపి ఈ దేశ భాష ఉర్దూను, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్‌ గురించి పక్కనబెట్టింది.
దీంతోపాటు ఎన్‌టిఎ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) పేరుతో జాతీయస్థాయి ఆర్హత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు హేతుబద్ధత లేదనేది వాస్తవం. దీని నిర్వహణ, పరీక్ష పాత్రల తయారీలో జవాబుదారీతనం లేదనేది కనపడింది. ఈ విద్యా విధానం అమల్లో జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు.ఇది మంచి నిర్ణయమే కానీ ఈ పదేండ్లలో నాలుగు శాతం కూడా నిధులు కేటాయించలేనివారు రేపు ఆరు శాతం కేటాయించడం సాధ్యమా? దీనిలో పిలంత్రపిక్‌ సంస్ధల పేరిట నిధులు కేటాయించి ప్రభుత్వ అనుకూల భావజాలాన్నీ, మూఢవిశ్వాసాలు విద్యలో పెంచి పోషించనున్నారు. ముఖ్యంగా సామ్రాజ్య వాద దేశాలకు మన మేదస్సును తాకట్టుపెట్టే లాగా ఉంది. విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యను వ్యాపారం చేసుకునేలా రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలకనున్నది ఎన్‌ఈపి. అందుకే ఈ దేశానికి ఆధు నిక ప్రత్యామ్నాయ విద్య కావాలి. తిరోగమన, సనాతన, మనుధర్మ విద్యా విధానం పోవాలి. అందుకు మహనీయుల స్ఫూర్తితో ఉద్యమించాలి.
ఆర్‌ఎల్‌ మూర్తి
8247672658