– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై బురద జల్లడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పని చేస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు మోడీ, అమిత్ షాలు పదేండ్లుగా కేసీఆర్‌పై నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదని గుర్తు చేశారు. దక్షిణాదిలో ఉనికే లేని ఆ పార్టీకి అభ్యర్థులు దొరక్క పోవడంతో బీఆర్‌ఎస్ నేతలను పార్టీలో చేర్చుకొని బీజేపీ, కాంగ్రెస్ టికెట్లిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో జనమే తేలుస్తారని హెచ్చరించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రాంతీయ పార్టీల హక్కులను రెండు పార్టీలు హరిస్తున్నాయని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేస్తామన్న కాంగ్రెస్ నినాదం హస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ నేతలు తమ భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీజేపీ నేతల గురించి మాట్లాడే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. మీడియా సమావేశంంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.