లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం– ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు గడువులోగా వెల్లడిస్తాం :సీఈసీ రాజీవ్‌ కుమార్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను గడువు లోగా బహిర్గతం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ అన్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సుప్రీం కోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. బుధవారం జమ్మూ కాశ్మీర్‌లో మీడియాతో ఆయన అన్నారు. ఎస్‌బీఐ నుంచి ఆ సమాచారం అందిన విషయాన్ని ధ్రువీ కరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పా రు. జమ్మూ కాశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండగలో ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు గాను ప్రతీ జిల్లాలో ఒక సోషల్‌ మీడియా సెల్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులందరికీ సరైన భద్రత సమకూర్చడంతోపాటు కేంద్ర బలగాలను దించుతామన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆన్‌లైన్‌ నగదు బదిలీపైనా పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ‘మార్చి 12 నాటికి ఎస్‌బీఐ ఎలక్టోరల్‌ బాండ్ల డేటా అందించాల్సి ఉండగా, ఆ వివరాలు మాకు అందాయి. ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తాం. కమిషన్‌ అనేది పారదర్శ కతకు ఎప్పుడూ అనుకూలమే. గడువులోగా దాన్ని బహిర్గతం చేస్తాం’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.