– మోడీ సర్కారు మాటలకే పరిమితం
– వచ్చే ఎన్నికల్లో గద్దెదించుతాం : ఎస్‌కేఎం మహాధర్నాలో నాయకుల హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతాంగ ఉద్యమ సందర్భంగా రైతులకిచ్చిన రాతపూర్వక హామీలు ఏమయ్యాయని సంయుక్త కిసాన్ మోర్చా ( ఎస్‌కేఎం) రాష్ట్ర నాయకులు ప్రశ్నించారు. ప్రధాని మోడీ మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అన్నదాతలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోడీ అమలు చేయలేదన్నారు. ఎస్‌కేఎం అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు టి. సాగర్, పశ్య పద్మ, బి. వెంకట్, రాయల చంద్రశేఖర్, మండల వెంకన్న, విస్సా కిరణ్, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, కాంతయ్య, శంకర్, వి. కృష్ణ, బి. రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని మోడీ సర్కారును కోరారు. పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలని సూచించారు. రైతులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు భూపాల్, సూర్యం, ఎం. శ్రీనివాస్, జనార్ధన్ మాట్లాడుతూ కనీస వేతనం రూ. 26వేలు నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని సూచించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారని విమర్శించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువజన, విద్యార్థి, వృత్తి సంఘాల నాయకులు అనగంటి వెంకటేష్, మహేష్, లెల్లెల బాలకష్ణ మాట్లాడుతూ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన మోడీ మోసం చేశారన్నారు. మహిళా సంఘాల నాయకులు ఝాన్సీ, సంధ్య, సజయ మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకుంటున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్. వెంకట్ రాములు (వ్యవసాయ కార్మిక సంఘం), ఎస్. రమ, వంగూరు రాములు, సోమన్న (సీఐటీయూ), మూడ్ శోభన్, మాటూరి బాలరాజు గౌడ్, రామచందర్, ముసలయ్య, తిరుపతిరెడ్డి, టి. కిషోర్ (తెలంగాణ రైతు సంఘం), కోట రమేష్ (డీవైఎఫ్‌ఐ), అరుణ, అనురాధ (ఐఎఫ్‌టీయూ) తదితరులు పాల్గొన్నారు.