– ఇవే నాకు చివరి ఎన్నికలు..మళ్లీ పోటీ చేయను
– మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
నవతెలంగాణ-కంటోన్మెంట్
తాను పార్టీ మారడం లేదని.. రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. ఇంకో ఐదారేండ్లు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బెంగళూరులోని ఓ హౌటల్‌లో భేటీ అయిన ఫొటో ఒకటి గురువారం సోషల్ మీడియాలో వైరలైంది. కాంగ్రెస్‌లో చేరేందుకు డీకే శివకుమార్ ద్వారా పైరవీలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఈ భేటీపై మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. వ్యాపారాల విషయంలో రెండ్రోజుల కిందట డీకే శివకుమార్‌ను కలిశానని తెలిపారు. డీకే శివకుమార్ తనకు ఆప్తమిత్రుడు అని చెప్పారు. ప్రస్తుతం తనకు 71 సంవత్సరాలు ఉన్నాయని.. ఈ వయస్సులో పార్టీలు మారి సాధించేది ఏమీ లేదన్నారు. వేరే పార్టీల నుంచి తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని స్పష్టం చేశారు. ఈ ఐదేండ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే నాకు చివరి ఎన్నికలని స్పష్టత ఇచ్చారు.