– త్యాగాలు, బలిదానాలతో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు :రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణ – బంజారాహిల్స్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులపై అక్రమంగా పెట్టిన కేసులను, కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. లౌకిక ప్రజాస్వామిక ఐక్యకార్యాచరణ కమిటీ, తెలంగాణ ప్రజాస్వామిక రక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పాశం యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేక అంశాలపై సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆమోదించామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదటి, మలిదశ పోరాటాలు వందలాది మంది త్యాగాలు, బలిదానాలతో సాగాయని తెలిపారు. కొన్ని వందల మంది విద్యార్థులు, పోరాటయోధులు ఈ ఉద్యమంలో అమరులయ్యారని చెప్పారు. అమరుల కుటుంబాల్లో ఈనాటికీ వెలుగులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాల చరిత్రపై అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ కాలం నాటి కేసులను పూర్తిగా రద్దు చేయలేదని.. పైగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వందలాది మంది ఉద్యమకారులపై, ప్రజలపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఉద్యమకారులకు, ప్రజలకు కష్టాలు, జైళ్లు, కేసులు, గద్దెనెక్కిన వారికి సౌఖ్యాలు అన్నట్టుగా కేసీఆర్ పాలన సాగిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మందిపై అణచివేత కొనసాగిందన్నారు. కెేసీఆర్ ఒక చక్రవర్తిలా, కేటీఆర్ ఉపచక్రవర్తిలా.. ఆయన కుటుంబం అంతా యువరాజు యువరాణుల్లా వ్యవహరించారని విమర్శిం చారు. అధికార యంత్రాంగం ముఖ్యంగా నాటి పోలీస్ యంత్రాంగం బీఆర్ ఎస్‌కు బానిసగా పనిచేసిందని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, కేసీఆర్ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీల నాయకులపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించాలని కోరారు.
ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, తెలంగాణ ఉద్యమకారుడు పృద్విరాజ్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్, జర్నలిస్ట్ రఘు, తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమకారుడు విటల్ కరుణాకర్ దేశారు, సోగరా బేగం, జర్నలిస్ట్ శ్రావ్య, పర్వీన కళిదాజియ, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు, ఎంసీపీఐ తుకారం నాయకుు సతీష్ కుమార్, కామేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.