– మనస్తాపం చెంది కార్యక్రమాలకు దూరం..?
– త్వరలోనే కాంగ్రెస్ లో చేరిక..?
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో, నిజామాబాద్ రూరల్ లో బీఅర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కొందరు నాయకులు తనపట్ల వ్యవహరించిన తీరు తో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మండలంలో, ఉమ్మడి జిల్లాలో సౌమ్యుడుగా పేరొందిన ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా, నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ గా పదవి బాధ్యతల్లో ప్రస్తుతం ఉన్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అంటి ముట్టనట్లు దూరం పాటిస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం సామాన్య కార్యకర్తగా ఉంటూ తన పని తను చేసుకుంటూ ఉండేవారు.నలుగెళ్ళ క్రితం సహకార సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్ గా ఎన్నికల్లో నిలబడి విజయం సాధించి అందరూ డైరెక్టర్ల మద్దతుతో నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ రూరల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవి సాంబరి మోహన్ కు దక్కింది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ గా కూడా సాంబరి మోహాన్ ఉన్నారు. గత నాలుగేళ్లుగా సహకార సొసైటీ పరిధిలో ఎక్కడ వరి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా లారీలను, హమాలీల గోనెసంచుల కోరత రాకుండా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సౌమ్యుడు గానే పేరుగాంచారు. ఆనాడు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లే స్థాయి వరకు వెళ్లారు. కానీ గత కొన్నేళ్ళుగా రూరల్ నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలైనా, అధికారిక కార్యక్రమాలైన శీలఫలకాలపై పేరు లేకపోవడం ఒకానొక దశలో బాధపడ్డ సంఘటనలు లేకపోలేదు. ఆనాటి నుండి నేటి వరకు బిఅర్ఎస్ పార్టీ కి విధేయుడుగా ఉంటూ వచ్చారు. నియోజకవర్గంలో కొందరు నాయకుల తీరు సాంబార్ మోహన్ కు ఇబ్బందులు కలిగించిన అన్నింటికీ ఓర్చుకుంటూ కాలం వెళ్ల తీశారు. బిఅర్ఎస్ రాష్ట్రం లో అధికారం కోల్పోయింది.నిజామాబాద్ రూరల్ లో బాజిరెడ్డి గోవర్ధన్ ఓడిపోవడంతో ఎవరికి ఏం చెప్పాలో తోచక మిన్న కుండిపోయారు. బిఆర్ఎస్ పార్టీలో ఉంటే తనకు ప్రోటోకాల్ ప్రకారం దక్కే మర్యాద దక్కదనే ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలిసింది. గత కొన్ని రోజులుగా తన సన్నిహితులు, మిత్రులు, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పలు ధఫాలు చర్చలు జరిపి వారి సూచనలు సలహాలు తిసుకున్నారు.అందరి అబిప్రాయం మేరకు పార్టీ మారాలని సాంబార్ మోహన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాట్లు తెలిసింది. దానిలో భాగంగానే గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువ, పూల బోకేతో సన్మానించారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులకు పార్టీ పెద్దలకు చెప్పిన పట్టించుకోలేదని కనీసం శీల ఫలకాలపై కూడా పేరు రాకుండా కొందరు అడుగడుగునా అడ్డుకున్నారని,తన మనసులో ఉన్న మాటను పలువురితో చెప్పుకున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఒక్కొక్కరు బిఆర్ఎస్ కు విడిచి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయంశంగా మారింది. కానీ ఇప్పటికీ తను పార్టీ మారేది లేదని, కానీ కొందరు నాయకులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారని, తనపై చిన్నచూపు చూడడమే కాకుండా రూరల్ నీయోజకవర్గం లో కనీసం మర్యాద కూడా ఇవ్వలేదని,తన మనస్సు కు గాయపరిచిందని, అలాంటి పార్టీలో ఉంటే మళ్ళీ కోందరిదే రాజ్యం ఉంటుందని,దాని కోసమే పార్టీ మారక తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు “నవ తెలంగాణ”కు వివరించారు.
త్వరలోనే కాంగ్రెస్ గూటికి ఐడి సిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్..?
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈయన చేరికతో నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరానుందని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంతగానో తోడ్పాటు తుందని,కాంగ్రెస్లో చేరడానికి సాంబార్ మోహన్ కు కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న నాయకులు, కార్యకర్తలతో ఏలాంటి వ్యతిరేకత లేక పోవడం తో చేరిక కు మార్గం సుగమం అయింది. ఐడీసీఎంఎస్ చైర్మన్ తో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొందరు డైరెక్టర్లు, పార్టీల ముఖ్య నాయకులు ఆయన బాటలోనే కాంగ్రెస్లో చేరనున్నట్లు విశ్వసనియంగా తెలిసింది. త్వరలోనే చేరికల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐడిసిఎంఎస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ అని చెప్పుకోక తప్పదు. తేదీ ఎప్పుడు ఖరారవుతుందో వేచి చూద్దాం.