– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– 11.20 కోట్లతో ఇరిగేషన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్: మూడు నెలల్లో మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క లో కోటి 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామని, ఏసీ సౌకర్యాన్ని కలగజేస్తామని, అన్ని రకాల జబ్బులకు చికిత్స అందించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. అవసరమైతే అదనపు నిధులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ ప్రాంత ప్రజలు చికిత్స కోసం దూరంగా వెళ్లకుండా ఉన్నచోటే చికిత్స పొందేందుకు పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఆస్పత్రిని పూర్తి హంగులతో నిర్మించేందుకు అవసరమైతే తన నిధుల నుండి 50 లక్షల రూపాయల ఇస్తానని తెలిపారు. ఏ ఆపద వచ్చినా తాను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు పంపిస్తామని ప్రత్యేకించి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దత్తత తీసుకొని మరిన్ని సేవలు అందించేలా చూస్తామని అన్నారు. అనంతరం మంత్రి సాగర్ రోడ్ లో 11 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆర్డిఓ రవికుమార్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.