మహారాష్ట్ర ప్రాజెక్టు కోసం…

– రూ.140 కోట్ల బాండ్లు కొనుగోలు చేసిన మేఘా
న్యూఢిల్లీ : హైదరాబాదుకు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గత సంవత్సరం ఏప్రిల్‌ 11న రూ.140 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. దానికి నెల రోజుల ముందే ఆ కంపెనీకి రూ.14,400 కోట్ల విలువైన థానే-బొరివాలీ జంట టన్నెల్‌ ప్రాజెక్ట్‌ టెండర్‌ దక్కడం గమనార్హం. మొత్తంమీద ఈ కంపెనీ అత్యధిక విలువ కలిగిన బాండ్లను (రూ.821 కోట్లు) కొనుగోలు చేసిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. టన్నెల్‌ ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్‌ కంపెనీ ఒక్కటే టెండర్‌ దాఖలు చేసింది. టన్నెల్‌ నిర్మాణం కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థ దాఖలు చేసిన బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ఆ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం కలగలేదు.