– రాష్ట్రంలో టీజీ పేరుతో మొదలైన వాహన రిజిస్ట్రేషన్లు
– తొలిరోజు వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది : రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్
– ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో ‘టీజీ’ నెంబర్ ప్లేట్ ఆవిష్కరించిన ట్రాన్స్‌పోర్టు కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల నెంబర్ ప్లేట్ ఏపీ నుంచి టీజీగా మన వాహనాలకు అతికించామని, ఆ రోజు ఉద్యమంలో ‘టీజీ’ మన ఆత్మగౌరవనానికి ప్రతీకగా చెప్పుకున్నామని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లు(జేటీసీ) సి.రమేష్, మమత ప్రసాద్, ప్రవీణ్ రావు, ఆర్టీవోలతో కలిసి ఆయన టీజీ నెంబర్ ప్లేట్‌ను ఆవిష్కరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ నుంచి టీజీగా మార్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి టీజీ నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని, ఇందుకోసం తమ అధికారులు, ఐటీ సిబ్బంది రాత్రంతా ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. అందుకు తగిన విధంగానే కొత్త నెంబర్ల కోసం ప్రజల నుంచి భారీ స్పందన లభించిందన్నారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా టీజీ పేరుతో 1,475 నంబర్లు కేటాయించగా.. తద్వారా రూ. 2.5కోట్ల ఆదాయం రవాణాశాఖకు వచ్చిందని తెలిపారు. ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో 125 వాహన నెంబర్లు కేటాయింపు ద్వారా మొదటి రోజు రూ.30.49లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో టీజీ 09 0001 నెంబర్‌కు ఏకంగా 9.61లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు. అన్ని ఆర్టీవో, యూనిట్ ఆఫీసుల్లో అద్భుతమైన స్పందన కనిపించిందని తెలిపారు.
తొలిరోజే రికార్డు స్థాయిలో ఆదాయం రావడంతో రానున్న రోజుల్లో మరింత ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. ఇప్పటికే టీఎస్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనాలను టీజీగా మార్చబోమని, అవి యథావిధిగానే కొనసాగుతాయని తెలిపారు. వాహన యజమానులు ప్రతిరోజు అంతకు ముందు రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ నుంచి వెయ్యి నంబర్ల లోపు ఇప్పటి విధానం ప్రకారమే టీజీ సిరీస్‌లో రిజర్వు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏపీ సిరీస్ పేరుతో 70.68లక్షల వాహనాలు, టీఎస్ సిరీస్‌తో 92.82లక్షల వాహనాలు నమోదైనట్టు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీవోలు రవీందర్ కుమార్, సదానందం, పురుషోత్తం రెడ్డి, కిషన్ నాయక్, సీపీ. వెంకటేశ్వర్ రావు, వి.శ్రీనివాస్ రెడ్డి, కిష్టయ్య, సీనియర్ ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఐటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.