దాడుల తర్వాతనే…

దాడుల తర్వాతనే...– 41 కంపెనీల నుంచి బీజేపీకి విరాళాలు
– 18 కంపెనీల నుంచే రూ.2,010కోట్లు!
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి దాడులను, చర్యలను ఎదుర్కొన్న తర్వాత 30 కంపెనీలు బీజేపీకి రూ.355 కోట్లను విరాళాలుగా అందజేశాయని ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ వార్తా వెబ్‌సైట్‌లైన న్యూస్‌లాండ్రీ, ది న్యూస్‌ మినిట్‌ పేర్కొన్నాయి. కానీ మరో 11 కంపెనీలు కూడా పాలక పార్టీకి రూ.62.3కోట్లు విరాళమిచ్చి ఇదే బాటలో పయనించినట్లు మూడు రోజుల క్రితం వెల్లడైంది. అంటే మొత్తంగా 41 కంపెనీలకు గానూ 18 కంపెనీలు గత రాత్రి ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల జాబితాలో వున్నాయి. ఈ 18 కంపెనీలు ఏకంగా దాదాపు రూ.2,010.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. అంటే గతంలో 41 కంపెనీలు బాండ్ల రూపంలో అందజేసిన విరాళాల మొత్తం కన్నా ఐదు రెట్లు ఎక్కువ. వాటిలో కొన్ని సంస్థల వివరాలిలా ఉన్నాయి.
లాటరీ కింగ్‌ : అన్నింటికంటే అగ్రభాగాన తమిళనాడుకు చెందిన లాటరీ కంపెనీ ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ పీఆర్‌ వుంది. అనేక క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న, లాటరీ కింగ్‌గా తనకు తాను చెప్పుకునే శాంటియాగో మార్టిన్‌ ఈ కంపెనీ అధినేత. రూ.1368 కోట్ల మేరకు బాండ్ల రూపంలో ఈ కంపెనీ విరాళాలు అందజేసింది.
యశోదా హాస్పిటల్స్‌ : రావు సోదరులైన రవీందర్‌, సురేందర్‌, దేవేందర్‌లకు చెందిన ఈ గ్రూపు ఆఫ్‌ హాస్పటల్స్‌ రూ.162 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది.
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ : ముంబయికి చెందిన ఈ కంపెనీ దాని అనుబంధ సంస్థలు కలిపి 2014 నుంచి 2023 వరకు రూ.84 కోట్లను బీజేపీకి విరాళంగా అందజేశాయి. గత రాత్రి ఎన్నికల కమిషన్‌ అందజేసిన డేటా ప్రకారం ఐఆర్‌బి-మోడరల్‌ రోడ్‌ మేకర్స్‌, ఐఆర్‌బీ ఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే, ఐడియల్‌ రోడ్‌ బిల్డర్స్‌ – కలిపి ఇచ్చిన రూ.84 కోట్లలో మోడరల్‌ రోడ్‌ మేకర్స్‌ రూ.53 కోట్లను, ఐఆర్‌బీ ఎంపీ ఎక్స్‌ప్రెస్‌ వే రూ.25 కోట్లను, ఐడియల్‌ కంపెనీ రూ.6కోట్లను అందజేశాయి.
సోమ్‌ డిస్టిలరీస్‌ : దాడి జరిగిన వెంటనే విరాళమిచ్చిన కంపెనీల్లో మధ్యప్రదేశ్‌కి చెందిన సోమ్‌ డిస్టిలరీస్‌ ఒకటి. అరెస్టయిన తన ప్రమోటర్లను విడుదలైన పది రోజుల్లో రూ.3కోట్లు విరాళంగా ఇచ్చింది.
హెటెరో గ్రూపు: హైదరాబాద్‌కి చెందిన హెటెరో గ్రూపు ఒక ఫార్మస్యూటికల్‌ సంస్థ. బీఆర్‌ఎస్‌కి చెందిన రాజ్యసభ సభ్యుడు, సంపన్నుడైన ఎంపీ అయిన పార్ధసారధి రెడ్డి సారధ్యంలో ఇది నడుస్తోంది. మొదట వెబ్‌సైట్‌లు విడుదల చేసిన 30 కంపెనీల జాబితాలో ఇది వుంది. మూడు కంపెనీలతో కూడిన ఈ గ్రూపు 2022 ఏప్రిల్‌ 7 నుండి 2023 అక్టోబరు 12 మధ్యలో రూ.60కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది.
ఎస్‌పిఎంఎల్‌ ఓం, మెటల్‌ జెవి: ఓం కొఠారి గ్రూపునకు చెందిన ఈ కంపెనీకి జల విద్యుత్‌, రియల్‌ ఎస్టేట్‌, ఆటో డీలర్‌షిప్‌లు, హోటళ్లు, వినోద కేంద్రాల్లో వ్యాపారాలు వున్నా యి. 2020 జులో ఐటి దాడులవగానే రూ.5కోట్లు విరాళంగా ఇచ్చింది. తిరిగి 2021లో అక్టోబరు 4న మరో రూ.5కోట్లు విలువైన బాండ్లను కొంది.
రామ్‌కో సిమెంట్స్‌ : తమిళనాడుకు చెందిన ప్రధాన సిమెంట్‌ తయారీ గ్రూపు అయిన రామ్‌కో సిమెంట్స్‌ 2022 అక్టోబరు 10 నుంచి, 2023 నవంబరు 15 మధ్య రూ.54కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
కెజెఎస్‌ గ్రూపు : మధ్యప్రదేశ్‌కి చెందిన కెజెఎస్‌ సిమెంట్స్‌ 2019 ఏప్రిల్‌ 20, 2019 మే 9 మధ్య రూ.14కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది.
ఐఎల్‌ఎబిఎస్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ : హైదరాబాద్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన ఈ కంపెనీ 2023 ఏప్రిల్‌ 10న రూ.5 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. 2019 మే లో కూడా బీజేపీకి రూ.5కోట్లు విరాళమిచ్చింది.