లక్ష్యసేన్‌ ఓటమి

లక్ష్యసేన్‌ ఓటమి– పోరాడి ఓడిన యువ షట్లర్‌
– ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌
బర్మింగ్‌హామ్‌ : ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ యువ కెరటం లక్ష్యసేన్‌ పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌పై కన్నేసిన లక్ష్యసేన్‌ శనివారం జరిగిన సెమీఫైనల్లో పోరాడి ఓడాడు. ఇండోనేషియా షట్లన్‌ జొనాథన్‌ క్రిస్టీ చేతిలో 1-2తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మూడు గేముల పాటు సాగిన హోరాహోరీ సెమీఫైనల్లో 12-21, 21-10, 15-21తో నిరాశపరిచాడు. గంటకు పైగా సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ అంచనాలను అందుకోలేదు. తొలి గేమ్‌లో వెనుకంజ వేసిన లక్ష్యసేన్‌ 12-21తో ఆధిక్యం కోల్పోయాడు. కానీ రెండో గేమ్‌లో లక్ష్యసేన్‌ బలంగా పుంజుకున్నాడు. జొనాథన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఏకపక్షంగా పాయింట్లు సాధించిన లక్ష్యసేన్‌ మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. డిసైడర్‌ గేమ్‌ ఆరంభంలో లక్ష్యసేన్‌ ఆకట్టుకున్నాడు. 3-0తో అదిరే ఆరంభం సాధించాడు. కానీ ఇండోనేషియా షట్లర్‌ వేగంగా పుంజుకున్నాడు. లక్ష్యసేన్‌ దూకుడు సైతం క్రిస్టీకి కలిసొచ్చింది. విరామానికి ముందే ముందంజ వేసిన క్రిస్టీ.. ఆ తర్వాత జోరు కొనసాగించాడు. 20-12తో సేన్‌ ఆశలు ఆవిరి చేశాడు. ఆఖర్లో వరుసగా మూడు పాయింట్లతో మెరిసినా.. లక్ష్యసేన్‌ అద్భుతానికి అడుగు దూరంలో ఆగిపోయాడు.