– రేపటి నుంచి ‘పది’ పరీక్షలు
– 5,08,385 మంది విద్యార్థుల హాజరు
– 2,676 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
– ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల రెండో తేదీ వరకు ఇవి జరుగుతాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ఇబ్బందులు రాకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు సబ్జెక్టు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరుగుతుంది. సైన్స్ సబ్జెక్టును రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులను వేర్వేరు రోజుల్లో ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. అయితే 9.35 గంటల వరకు విద్యార్థులకు గ్రేస్ పీరియడ్‌తో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులను ఉదయం 8.30 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సకాలంలో చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,469 పాఠశాలల నుంచి 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వారిలో 2,57,952 మంది అబ్బాయిలు, 2,50,433 మంది అమ్మాయిలున్నారు. వారి కోసం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,676 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,676 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు పంపించారు. షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం 040-23230942ను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు పోలీసుల బందోబస్తు ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో ఆ ప్రాంతంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలి. మాల్‌ప్రాక్టీస్‌లను నివారించడం, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పర్యవేక్షణ కోసం 144 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను, సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు, సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను తేవడాన్ని నిషేధించారు. హాల్‌టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, షార్ప్‌నర్, ఎరేసర్, జామెట్రీ పరికరాలను మాత్రమే అనుమతిస్తారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.