– నిధులతో శివసేన, ఎన్సీపీలను విభజించింది
– ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలనూ కూల్చింది: బీజేపీ, మోడీపై రాహుల్ విసుర్లు
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్‌ను సులభతరం చేసేందుకు కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని మోడీ ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ పథకం ద్వారా అధికార బీజేపీ సంపాదించిన నిధులను మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లను విభజించటానికి ఉపయోగించారని రాహుల్ అన్నారు. ఈ నిధులను ఇతర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేయటానికి కూడా బీజేపీ ఉపయోగించిందని చెప్పారు. ఎన్నికల సంఘం(ఈసీ) తన వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్‌ల కొనుగోలుదారులు, గ్రహీతల వివరాలను ప్రచురించిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ భారత్ జోడో న్యారు యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండిలో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పైవిధంగా అన్నారు. ”ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్. ఇది అవినీతి కుంభకోణం తప్ప మరొకటి కాదు. కాంట్రాక్టు ఇచ్చిన నెలల తర్వాత లేదా సీబీఐ, ఈడీ దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీలు అకస్మాత్తుగా బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లను ఇవ్వడం ప్రారంభించాయి” అని రాహుల్ ఆరోపణల వర్షం కురిపించారు.